Michael Clarke : సుదీర్ఘ ఫార్మాట్‌పై చెరగని ముద్ర వేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రత్యర్థి ఆటగాళ్ల ‘స్లెడ్జింగ్’కు వాళ్ల భాషలో బదులిస్తూ.. ప్రేక్షకులను తన హావభావాలతో అలరిస్తూ ఉండే విరాట్ లేని భారత టెస్టు జట్టును ఊహించడం కొంచెం కష్టమే. ఇంగ్లండ్ పర్యటన (England Tour)కు ముందే రిటైర్మెంట్ బాంబ్ పేల్చిన కోహ్లీ.. ఓ రకంగా ప్రత్యర్థి మానసిక స్థయిర్యాన్ని పెంచిందనే చెప్పాలి. ఒకవేళ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఓడిపోతే కోహ్లీ కచ్చితంగా యూటర్న్ తీసుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (Michael Clarke) అంటున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తొలి సైకిల్లో భారత జట్టు తొలి సమరానికి సిద్దమైంది. దశాబ్దకాలంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్‌లు లేకుండానే ఇంగ్లండ్‌తో గిల్ సేన తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కోసం భారత బృందం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. సీనియర్ల గైర్హాజరీలో గిల్ సేన ప్రదర్శన ఎలా ఉంటుంది? అనేదానిపై తలోకరకంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై ఆసీస్ మాజీ సారథి, ప్రస్తుతం కామెంటేర్‌గా అవతారమెత్తిన క్లార్క్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
‘సీనియర్లు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై విజయం సాధించడం భారత్‌కు కష్టమే. ఒకవేళ ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా 5-0తో వైట్‌వాష్‌కు గురైందనుకోండి.. అప్పుడు అభిమానులు కోహ్లీ మళ్లీ ఆడాలని ముక్తకంఠంతో నినదిస్తారు. అన్నివైపుల నుంచి కెప్టెన్, కోచ్‌లపై ఒత్తిడి వస్తుంది. ఈ సమయంలో కెప్టెన్ , సెలెక్టర్లు కోహ్లీని సంప్రదించే అవకాశముంది. ఫ్యాన్స్ మద్దతు కూడా ఉందనుకోండి.. విరాట్ యూటర్న్ తీసుకునే అవకాశముంది.
ఎందుకంటే.. అతడు ఇప్పటికీ టెస్టు క్రికెట్‌ను ఇష్టపడుతున్నాడు. ఇంకో రెండు మూడేళ్లు సుదీర్ఘ ఫార్మాట్ ఆడగల సత్తా అతడికి ఉందన్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికైతే విరాట్ స్థానాన్ని సాయి సుదర్శన్ (Sai Sudarshan)తో భర్తీ చేయడం మంచిది. ఐపీఎల్లో దంచేసిన ఈ కుర్రాడు సాంకేతికంగా ఆరితేరినవాడు. ఎలాంటిపరిస్థితులనైనా ఎదుర్కోగల మానసిక సన్నద్థత సుదర్శన్‌కు ఉంది. సో.. మూడో స్థానంలో నా ఛాయిస్ అతడే’ అని క్లార్క్ వెల్లడించాడు.
టెస్టు క్రికెట్‌కు ఊపిరిలూదిన వాళ్లలో విరాట్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి ఉంటే కచ్చితంగా పదివేల క్లబ్లో చేరేవాడే. కానీ, రికార్డుల కోసమే ఆడుతాడనే మచ్చ తనకు వద్దు అనుకున్నాడు కాబోలు.. విమర్శకుల నోళ్లకు చిక్కకుండా వీడ్కోలు పలికాడు కోహ్లీ. ఫ్యాబ్ 4లో ఒకడిగా.. రన్ మెషీన్‌గా పేరొందిన విరాట్ 123 టెస్టుల్లో 9,234 రన్స్ సాధించాడు.
సాయి సుదర్శన్
సీనియర్లు రిటైర్ కావడంతో టెస్టు జట్టులో యువరక్తం నింపాల్సిన సమయం వచ్చింది. అందుకే సెలెక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ పర్యటనకు కుర్రాళ్లకు అవకాశమిచ్చారు. వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఉంటున్న శుభ్‌మన్ గిల్‌ను ఏకంగా సారథిగా చేశారు. యంగ్స్టర్లు.. సీనియర్లు బుమ్రా, జడేజాలతో కూడిన స్క్వాడ్‌కు గిల్, గంభీర్‌లు దిశానిర్దేశనం చేయనున్నారు.