వేములపల్లి, జూన్ 07 : ఎర్రజెండా ద్వారానే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం వేములపల్లి మండల కేంద్రంలో 7వ మండల మహాసభ జిల్లా యాదగిరి అధ్యక్షతన నిర్వహించగా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారుల సమాజంలో అసమానతలు విపరీతంగా పెరిగి ధనికులు మరింత ధనికులుగా, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నట్లు తెలిపారు. సమాజంలో అసమానతలు, దోపిడి పోవాలంటే అది సీపీఐ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. అసమానతలు లేని సమాజం కోసం పేదల పక్షాన నిలబడి విప్లవ పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టుల సొంతమన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దిరాల రంగారెడ్డి, నాయకులు అంజనపెల్లి రామలింగం, శాంతమ్మ, ఉదయ్, శ్రీనివాస్‌రెడ్డి, పుట్టల నాగయ్య, కృష్ణ, వల్లంపట్ల వెంకన్న, వల్లంపట్ల సుధాకర్, సత్యం, లింగయ్య, ఆనందం పాల్గొన్నారు.