Lionel Messi : ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) కొత్త ఏడాది తొలి సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. సౌదీ అరేబియా వేదికగా జరిగే రియాద్ సీజన్ కప్(Riyadh Season Cup) 2024లో ఈ స్టార్ ఆటగాడు బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తన పోస్ట్‌కు ‘రెడీ, సెట్, రియాద్’ అంటూ మెస్సీ క్యాప్షన్ పెట్టాడు.
ఆ పోస్ట్‌లో మెస్సీ ఫుట్‌బాల్‌తో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. రియాద్ సీజన్ కప్‌లో మెస్సీ.. తన చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)ను ఢీకొట్టనున్నాడు.
జనవరి 19వ తేదీన రియాద్ సీజన్ కప్ 2024 షురూ కానుంది. ఈ టోర్నీలో మొత్తంగా మూడు జట్లు పాల్గొననున్నాయి. జనవరి 29న జరిగే మ్యాచ్‌లో రొనాల్డో నేతృత్వంలోని అల్ నస్రీ(Al Nassr) క్లబ్ జట్టుతో మెస్సీ సారథ్యంలోని ఇంటర్ మియామి తలపడనుంది. నిరుడు ఫిఫా వరల్డ్ కప్ అనంతరం ఈ ఇద్దరు దిగ్గజాలు సౌదీ ప్రో లీగ్(Soudi Pro League)లో తలపడ్డారు. అప్పుడు మెస్సీ పై చేయి సాధించాడు. అయితే.. ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న వీళ్లలో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
మెస్సీ, రొనాల్డో
నిరుడు సంచలన ప్రదర్శన చేసిన మెస్సీ పలు అవార్డులు కొల్లగొట్టాడు. ‘బెస్ట్ ఫిఫా మెన్స్ ఫుట్‌బాలర్’ అవార్డుతో పాటు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ‘బాలెన్ డిఓర్’ అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు రొనాల్డో 2023లో 54 గోల్స్‌తో ‘గోల్ స్కోరర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ అనంతరం మెస్సీ.. మియామి క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో కాంట్రాక్టు రద్దు కావడంతో రొనాల్డోను అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.