MCA : భారత క్రికెట్‌పై చెరగని ముద్రవేసిన ఆటగాళ్లకు ముంబై క్రికెట్ సంఘం (MCA) సముచిత గౌరవం కల్పిస్తోంది. ఈమధ్యే వాంఖడే స్టేడియంలో లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేరిట ప్రత్యేక గదిని ప్రారంభించి ముంబై బోర్డు.. ఈసారి విగ్రహాలను ఏర్పాటు చేయనుంది. ఓపెనర్‌గా టీమిండియా విజయాల్లో భాగమైన సన్నీ నిలువెత్తు విగ్రహాన్ని తమ క్రికెట్ అసోసియేషన్ మ్యూజియంలో పెట్టనుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన శరద్ పవార్ స్టాచ్యూను కూడా ఇక్కడే ఆవిష్కరించాలని సంకల్పించింది బోర్డు. ఎంసీఏ మ్యూజియం ప్రవేశం ద్వారంలో.. అంటే లోపలికి అడుగుపెట్టగానే ఇరువురి విగ్రహాలు కనిపించనున్నాయి.
‘ఎంసీఏ మ్యూజియంలోకి రాగానే గవాస్కర్, పవార్ల నిలువెత్తు విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. పవార్ ముంబై క్రికెట్లో ఐకాన్ అయితే.. సన్నీ భారత క్రికెట్ గొప్ప ఆటగాళ్లలో ఒకరు. అందుకే.. ఈ ఇద్దరిని గొప్పగా గౌరవించాలనుకున్నాం. గవాస్కర్ నిలువెత్తు విగ్రహం ఆటలో ఆయన అసాధారణ ప్రతిభకు తార్కాణం. రాబోయే రోజుల్లో యు క్రికెటర్లలో స్ఫూర్తి నింపడంలో గవాస్కర్ స్టాచ్యూ కీలకం కానుంది’ అని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు.
The Little Master stands tall!
Sunil Gavaskar will be honoured with a life‑size tribute at the MCA Museum ⭐#SunilGavaskar pic.twitter.com/fJGGxZGXH6
— 100MB (@100MasterBlastr) August 1, 2025
తనకు ఈ గుర్తింపు లభించడం పట్ల గవాస్కర్ సంతోషం వ్యక్తం చేశాడు.’ ముంబై క్రికెట్ సంఘం కల్పిస్తున్న ఈ గౌరవం నా హృదయాన్ని తాకింది. నేను క్రికెటర్‌గా ఎదగడంలో.. భారత జట్టు తరఫున ఆడడంలో ఎంసీఏ సహకారం మరువలేనిది. ఆటలో దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు నా శక్తి సామర్థ్యాలను సానబెట్టుకోవడంలో బీసీసీఐ ఎంతో తోడ్పడింది. ఈ గౌరవాన్ని నేను జీవితాంతం సెలబ్రేట్ చేసుకుంటా’ అని గవాస్కర్ భావోద్వేగంతో చెప్పాడు.
బీసీసీఐ మాజీ బాస్ అయిన శరద్ పవార్ ప్రస్తుతం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తన సొగసైన షాట్లతో కోట్లాది మందిని అలరించిన గవాస్కర్.. 1987లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నాడీ లెజెండ్.