AP Liquor Scam | లిక్కర్ కేసులో రోజుకో పిట్ట కథ చెబుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చేందుకు లిక్కర్ స్కామ్‌ను తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. విజయవాడలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ పేరుతో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తోందని మండిపడ్డారు. అధికారులు కూడా ప్రభుత్వానికే వంతపాడుతున్నారని అన్నారు.
అసలు లిక్కర్ స్కాం ఎక్కడ జరిగిందో ఇప్పటికీ తెలియడం లేదని సజ్జల విమర్శించారు. లిక్కర్ స్కామ్ డబ్బులు గల్ఫ్‌లో ఉన్నాయని.. ఒకసారి ఆఫ్రికాలో ఉన్నాయని.. మరోసారి ఎన్నికల్లో ఖర్చుపెట్టారని అంటున్నారని విమర్శించారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెబుతున్నారని.. లేని, జరగని స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పాలసీ వల్ల ఎక్కడ నష్టం జరిగిందో మాత్రం చెప్పడం లేదని అన్నారు.
కూటమి ప్రభుత్వం కేసుల పేరు చెప్పి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారని సజ్జల విమర్శించారు. వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. కుంభకోణం ఎక్కడ జరిగిందో చెప్పకుండా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే అని ఆరోపించారు. 2019-24 మధ్య స్కాం జరగలేదని, 2014-19 మధ్య అసలైన లిక్కర్ స్కాం జరిగిందని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండికొడుతున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీతో ప్రభుత్వ ఆదాయం పెరిగిందని సజ్జల తెలిపారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా అని ప్రశ్నించారు. పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకొస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని అడిగారు. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతంగా తాగించడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రూ.11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి అని ప్రశ్నించారు. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే ఉంటుందా అని అడిగారు.