Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 1: ‘అమ్మా చెత్త బండి వచ్చింది.. జెప్పన తీసుకురండి..’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ప్రతీ రోజు ఉదయం వినిపించే మాట ఇది. పారిశుధ్య కార్మికులు ఆటో ట్రాలీలతో ఇంటింటికి వచ్చి చెత్తను తీసుక వెళ్లేముందు ఇంటింటి తలుపు తట్టి ఇలా పిలవడం రివాజు. ఐతే నగర పాలక సంస్థ 25వ డివిజన్ (పాత)లో గత మూడు రోజులుగా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు రావడం లేదు. దీంతో ఇళ్లలో కుప్పలుగా చెత్త పేరుకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతుండటంను గమనించిన ఆ డివిజన్ మాజీ మహిళా కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శుక్రవారం తానే పారిశుధ్య కార్మికురాలిగా మారింది.
తన సొంత స్కూటీ వాహనంకు రెండు వైపుల డస్ట్ బిన్లను బిగించుకొని చంద్రబాబు కాలనీ, ఆర్టీసీ కాలనీ, బృందావనం కాలనీ, కేసీఆర్ కాలనీ, శారదా నగర్, టీచర్స్ కాలనీలోని ఇంటింటికి వెళ్లి బైక్ హారన్ కొడుతూ అమ్మ చెత్త బండి అని పిలిచింది. ఈసారి పిలుపు మారడంతో ఒక్కొక్కరుగా అనుమానం వచ్చి ఇళ్లలోని చెత్త డబ్బాలతో బయటకు వచ్చి చూసి నిర్ఘాంతపోయారు. అయ్యో.. మీరేంటి మా ఇంటి చెత్తను తీసుకవెళ్లడం అంటూ కొద్దిసేపు అయోమయంకు గురయ్యారు. అందుకు ఆమె పర్వాలేదు. మీ ఇంట్లోని చెత్తను ఇవ్వండి నేను తీసుకవెళ్తాను అంటూ ఆ డస్ట్ బిన్ లో వేసుకొంటూ.. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించి వినూత్నంగా నిరసన వెలిబుచ్చింది.
స్థానికులకు కొద్దిసేపు అసలేం జరుగుతుందో అర్ధం కాక బిత్తరపోయారు. ఇదెక్కడి దుస్థితి అంటూ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ తమ డివిజన్ పై కక్షపూరితంగా మొదటి నుంచి వ్యవహరిస్తున్నారనీ, గత రెండు రోజులుగా చెత్త ట్రాలీలు పంపించడం లేదనీ, తనకు అవమానం అని భావించక డివిజన్ ప్రజల బాగోగులు ముఖ్యమని భావించి తానే గత్యంతరం లేక సొంత వాహనం ద్వారా చెత్తను సేకరించానని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని పేర్కొన్నారు.
అధికార పార్టీకి చెందిన నాయకులకు సంబంధించిన డివిజన్లలో మాత్రమే అధికారులు పనులు చేస్తున్నారని ఆరోపించారు. చెత్త సేకరణ వాహనాలు రావడం లేదని అధికారులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు. కేవలం కాంగ్రెస్ నాయకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కు మాత్రమే స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్లు వచ్చే పనులకే పరిమితం అయ్యారని వాపోయారు. నిర్లక్ష్యం వీడకపోతే మరోసారి కాలనీలోని చెత్తను ఇదే తరహాలో తీసుకవచ్చి మున్సిపల్ కార్యాలయం ముందే పడేస్తానని హెచ్చరించారు. కాగా ఆమె తీరు పట్ల డివిజన్ ప్రజలు హర్షించారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. రామగుండం మున్సిపల్ అధికారుల వైఖరి ని ఎండగట్టిన తీరు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.