Glenn Maxwell : భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)కి ఇంకా రెండు నెలలు ఉంది. కానీ, ఇప్పటికే ఈ ట్రోఫీపై రోజుకో చర్చ తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకూ సిరీస్ విజేతగా నిలిచేది ఎవరు అనేదానిపై ఇరు దేశాల మాజీలు కొందరు తలోమాట చెప్పారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో పరుగుల వరద పారించేది ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరుగుల వీరుడుగా నిలిచేది ఎవరో మ్యాక్సీ చెప్పేశాడు. ఫ్యాబ్ 4లో ఒకరైన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లలో ఎవరో ఒకరు దంచి కొడుతారని ఈ ఆల్‌రౌండర్ అన్నాడు. సూపర్ స్టార్ అటగాళ్లు అయిన కోహ్లీ, స్మిత్‌లు తమ స్టయిల్లో చెలరేగిపోతారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వాళ్లు కచ్చితంగా తమ ముద్ర వేస్తారు. వీళ్లలో ఇద్దరు కాకపోయినా ఎవరో ఒకరు అత్యధిక రన్స్ కొడుతారు.
మా తరంలోని అత్యుత్తమ ఆటగాళ్లు అయిన కోహ్లీ, స్మిత్‌ల ముఖాముఖి పోరు చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని మ్యాక్స్‌వెల్ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబర్‌లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. 22వ తేదీన ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 1992 తర్వాత తొలిసారి ఈ సిరీస్‌ను ఐదుమ్యాచ్లుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచంలోని మేటి జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియాలు మైదానంలోకి దిగితే హోరాహోరీ తప్పదు. అది కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే ఇరుజట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్ కవ్వింపులతో ఆటను మరింత రక్తి కట్టిస్తారు. అంతేకాదండోయ్.. పోటాపోటీగా శతకాలతో.. వికెట్ల వేటతో చెలరేగిపోతారు కూడా. అయితే.. గత మూడు పర్యాయాలు టీమిండియా దెబ్బకు కంగారు జట్టు తోకముడిచింది. దాంతో, ఈసారి సొంతగడ్డపై ఎలాగైనా ట్రోఫీ సాధించి పరువు కాపాడుకోవాలని ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ భావిస్తోంది. మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ముందున్న భారత్ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇంకేముంది.. రెండు సమఉజ్జీల మధ్య టెస్టు సమరం భలే రంజుగా సాగడం పక్కా.