సిద్దిపేట, ఫిబ్రవరి 23: బీడీ కార్మికులకు రూ.4వేల పింఛన్ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేయకుండా మోసం చేసిందని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు ఆరోపించారు. బీడీ కార్మికులకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు,బీడీ టేకేదార్లతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట బీఆర్టీయూ అనుబంధ సంస్థ తెలంగాణ రాష్ట్ర బీడీ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం బీడీ కార్మికులకు రూ.4వేల పింఛన్ ఇస్తామని మోసం చేసిందన్నారు. అలవి కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా బీడీ కార్మికులకు పింఛన్ పెంచాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వరర్స్ యూనియన్ అధ్యక్షుడు మంచే నర్సింహులు, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్,నాయకులు సింగిరెడ్డి ఐలారెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సింగ్, శోభన్, బాయికాడి శ్రీనివాస్, సంజీవులు, బీడీ టేకేదారులు, బీడీ వర్కర్లు పాల్గొన్నారు.