తెలంగాణ అస్తిత్వ చర్చలు ఇటీవల తిరిగి జరుగుతుండటం విశేషం. తెలంగాణ మేలును కోరుకునే ఆలోచనాపరులు, తెలంగాణ మేలు కోరుకోని వారు కూడా ఆ చర్చలను చేస్తున్నారు. తెలంగాణకు హాని కలిగే పరిస్థితులు మరొకమారు కనిపిస్తున్నాయన్నది ఈ ప్రాంతంలోని ఆలోచనాపరుల ఆందోళన. అది అస్తిత్వ సంబంధమైన ఆందోళన. రాజకీయాలు లేవు. రెండవ వర్గానికి అస్తిత్వ స్పృహ అన్నదే లేదు. లేదా, అది తమ అవసరార్థం ఉపయోగపడే వస్తువు మాత్రమే. తెలంగాణలో అటువంటి స్పృహ మళ్లీ తలెత్తుతుండటం తమ ప్రయోజనాలకు భంగకరమనే భయం మరికొందరికి ఏర్పడుతున్నది. అందులో రాజకీయం ఉన్నది.
అస్తిత్వం అనేది మౌలికంగా ఏమిటి? ఒక ప్రాణికి గాని, జన సమూహానికి గాని, ప్రాంతానికి గాని, వివిధ అంశాలకు, చివరకు వస్తువులకు కూడా అస్తిత్వమనేది ఉంటుంది. ప్రాణి అనే దానిలో మనుషులే కాదు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, కొండల వంటివి కూడా వస్తాయి. అస్తిత్వం అనే మాట అన్నింటికీ వర్తిస్తుంది. అస్తిత్వానికి రెండు పార్శాలు ఉంటాయి. ఒకటి, వాటి ఉనికి. రెండు, వాటి మనుగడ. ఈ రెండూ సవ్యంగా ఉంటేనే అస్తిత్వం సవ్యంగా ఉంటుంది. ఏ ఒక్కటి సవ్యంగా లేకున్నా అస్తిత్వం సవ్యంగా ఉండదు. ఆ విధంగా ఈ మౌలిక దృక్పథం అసలు సృష్టి అనేది జరిగినప్పటి నుంచే ఉన్నట్టు భావించాలి.
తెలంగాణ అస్తిత్వం గురించిన చర్చ గతంలోనూ జరిగిందే. అందులో స్థూలంగా మూడు దశలున్నాయి. మొదటిది, 1947లో దేశ స్వాతంత్య్రానికి పూర్వపు చారిత్రక దశ. రెండవది, 1948 నుంచి 1956 వరకు గల స్వరాష్ట్ర దశ. మూడవది, 1956 నుంచి 2014 వరకు ఉండిన పరాధీన దశ. వీటిలో మొదటి దశ గురించిన చర్చ అప్రస్తుతం గనుక వదిలేద్దాం. రెండవ దశలో ముఖ్యంగా 1953లో జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి 1956లో ఆంధ్ర రాష్ట్రంతో బలవంతపు విలీనం వరకు ఉండిన మధ్య కాలమంతా తెలంగాణ ఉనికి, మనుగడలతో కూడిన అస్తిత్వం, దాని పరిరక్షణ అనే ఆలోచనలతో, ఘర్షణలతో సాగిన సంగతి తెలిసిందే.
1956 నుంచి మూడవ దశ యావత్తు కూడా అటువంటిదే. ఈ మూడవ దశలో వేర్వేరు కోణాలు కనిపిస్తాయి. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు, తెలంగాణ ప్రాంతీయ బోర్డు నిర్వీర్యం కావటం, ముల్కీ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వంటివి ఒక కోణం. నక్సలైట్, దళిత, బీసీ, ఇతర బడుగు వర్గాలు, స్త్రీ వాదం, పౌరహక్కులు తదితర ఉద్యమాలు రెండవ కోణం. మొదటి కోణానికి తెలంగాణ భౌగోళిక ఉనికి, ప్రజలు, వనరులు, భాషా సంస్కృతుల మనుగడ అనే రెండింటితోనూ నిమిత్తం ఉండగా, రెండవ కోణానికి తెలంగాణ భౌగోళిక ఉనికితో కాకున్నా ప్రజలు, వనరులు, అభివృద్ధి, సంక్షేమాలతో కూడిన మనుగడతో సంబంధం ఉన్నది.
ఇందులో గమనించవలసిన విషయం మరొకటి ఉన్నది. నక్సలిజం తదితర సామాజిక అంశాలకు ప్రాతిపదిక అయ్యే సిద్ధాంతాలు, వాదనలు తెలంగాణకు పరిమితమైనవి గాక మొత్తం దేశానికి సంబంధించినవి కావటం నిజమే. కానీ ఆ వాదనలకు భూమిక కాగల, లేదా కలిసి రాగల పరిస్థితులు తెలంగాణలోనూ ఉండటం కూడా అంతే నిజం. కనుకనే అవి ఇక్కడ సైతం ఉద్యమాల రూపం తీసుకున్నాయి.
అవి, తెలంగాణ ఉనికి, మనుగడల విశాల ఉద్యమానికి ఏదో ఒక మేరకు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహ ఉద్యమాలుగా పాత్ర వహించాయి. ఉదాహరణకు సామాజిక తెలంగాణను ఆ వర్గాలు కొన్ని తమ నినాదంగా చేసుకున్నాయంటే, వారికి భౌగోళిక తెలంగాణ, దాని ఉనికి కూడా ఒక లక్ష్యమై, దాని మనుగడలో భాగంగా తమ మనుగడ అన్నది కూడా లక్ష్యమైందన్నమాట. అది ఒక సబ్ టెక్స్ వంటిది. మొత్తం మూడవ దశ పొడవునా 58 ఏండ్లపాటు ఎప్పుడు ఏ ఉద్యమం జరిగినా తెలంగాణ ఉనికి, మనుగడలతో కూడిన అస్తిత్వ భావనలు అంతర్లీనంగా ఉంటూనే వచ్చాయి.
అయితే, తొలిదశలో గాని, మలిదశలో గాని యథాతథంగా అస్తిత్వం అనే పదం తక్కువగానే వినిపించింది. ఆ మాటను ఒక దృక్పథంగా ముందుకు తెచ్చి, ఆ విషయాన్ని ఫోకస్డ్గా చర్చించటం, తర్కించటం అంతకన్నా లేదు. అందుకు తగిన కారణాలున్నాయి. ఉద్యమ కాలమంతా తెలంగాణ సమస్యలు, ఎదుర్కొన్న మోసాలు, దోపిడీ, అణచివేతలు, వివక్షలపై ప్రతిఘటనల అజెండాతోనే సాగింది. అందుకు రాజీలేని పరిష్కారం స్వరాష్ట్ర సాధన మాత్రమేనన్న లక్ష్యంతోనే నడిచింది. అటువంటి ఉద్వేగభరితమైన దశలో సైద్ధాంతిక చర్చలన్నవి సాధ్యమయ్యేవి కావు. పైన పేర్కొన్న ఉప నదుల వంటి సామాజిక ఉద్యమాల్లో సాధ్యం కాగలవు గాని, ప్రధాన స్రవంతి ఉద్యమంలో కావు. అందువల్లనే అట్లా జరగలేదు కూడా.
కేవలం సిద్ధాంతాల ప్రాతిపదికగా జరిగే ఉద్యమాలను మినహాయిస్తే, సార్వత్రిక అంశాల ప్రాతిపదికన సాగే వాటిలో ప్రజలు కూడా సార్వత్రిక రూపంలో పాల్గొంటారు. అటువంటి స్థితిలో అంతిమంగా ప్రధాన స్రవంతి ఉద్యమమే లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది తెలంగాణకు పరిమితమైన స్థితి కాదు. ఎక్కడైనా అంతే. భారత స్వాతంత్య్ర ఉద్యమమే ఓ ఉదాహరణ. అందులో గాంధీజీ సంఘ సంస్కరణలను, అంబేద్కర్ దళిత, లోహియా తదితరులు బడుగుల అంశాలను ముందుకు తెచ్చినా చివరకు వీటన్నింటిని ఉప స్రవంతులుగా మార్చుకుని ప్రధాన స్రవంతి ఉద్యమమే లక్ష్యాన్ని చేరుకున్నది.
ఉనికి, మనుగడ అనే రెండింటితో కూడిన అస్తిత్వానికి మూడు ముఖాలుంటాయి. ఒకటి, తాత్విక నిర్వచనం. రెండు, అందు గురించిన ఆదర్శ స్థితి. మూడు, వాస్తవ పరిస్థితులు. తాత్విక నిర్వచనం ఏమిటో పైన చూశాము. ఆదర్శమన్నది ఉద్యమ ప్రధాన స్రవంతికి, ఉప స్రవంతులకు కూడా మనుగడ కోసం, అభ్యున్నతి కోసం సమానంగా ఉపకరించగల ఆదర్శప్రాయమైన పరిపాలన నెలకొనటం. వాస్తవ పరిస్థితులన్నవి వాస్తవంగా జరిగేవి. ఇందులో ఆదర్శానికి, వాస్తవాలకు మధ్య వివిధ అంశాలు, పరిస్థితులను బట్టి ఏదో ఒక స్థాయిలో భిన్నత్వం, ఘర్షణాత్మక స్థితి ఎల్లప్పుడూ ఉంటుంది.
ఏ వ్యవస్థలోనైనా. చివరకు సోషలిస్ట్ దేశాలలోనూ. ఆ కారణంగా ఉప స్రవంతులు రాజీపడి మౌనం వహించాలని కాదు. వాస్తవాన్ని గుర్తించటం ఒక స్థాయిలో జరుగుతూనే, మరొక స్థాయిలో ఘర్షించటమూ అంతటా కనిపించేదే. అది ఏ సమాజానికైనా అవసరం కూడా. ఆ విధంగా, అస్తిత్వానికి తాత్విక నిర్వచనం చెప్పుకొని, తర్వాత ఆదర్శాలను నిర్దేశించుకుని, ఆ తర్వాత వాస్తవ పరిస్థితుల్లో వాటితోపాటు జీవించటమన్నది, అదే సమయంలో మెరుగుదల కోసం సంఘర్షించటమన్నది ఒక ప్రాణి నుంచి జన సమూహం నుంచి ఒక ప్రాంతం వరకు దేనికైనా అస్తిత్వ విశ్వరూప సందర్శన వంటిది అవుతుంది.
తెలంగాణ అస్తిత్వం ఇటీవల తిరిగి చర్చనీయాంశం అవుతున్నది ఎందుకంటే, ఈ రాష్ట్రపు భౌగోళిక ఉనికికి కాకున్నా మనుగడకు ముప్పు వాటిల్లగలదనే సూచనలు ఒక్కటొక్కటిగా కనిపిస్తున్నాయి. అవి తెలంగాణ ఆలోచనాపరులకు ఆందోళన కలిగిస్తుండటం ఒకటైతే, ఆ ప్రమాదానికి సమర్థనగా కొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడటం, రాయటం, వ్యవహరించటం మరొకటి అవుతున్నాయి. ఆ విధంగా సమర్థిస్తున్న వారిలో రెండు రకాల వారున్నారు. ఒకరు మొదటి నుంచి తెలంగాణను దోచి, అందుకు అవకాశం పోగా, ఆ అవకాశం తిరిగి ఏ విధంగానైనా సంపాదించాలని అనుకుంటున్నవారు. వారికి తెలంగాణ అస్తిత్వ ఆలోచనలు మళ్లీ ముందుకు వస్తుండటం కంటగింపు అవుతున్నది. వారి వ్యతిరేకత ఆ పార్టీ, ఈ పార్టీపై అని కాదు. మౌలికంగా తెలంగాణపై. తెలంగాణ ప్రత్యేక ఉనికి, మనుగడపై, అస్తిత్వంపై. ఈ విధమైన తమ ఆలోచనలను 2014 వరకు బాహాటంగా ప్రకటించినట్టు ఇప్పుడు చేయలేరు గనుక నర్మగర్భంగా ప్రకటిస్తారు. అంతకన్నా ముఖ్యంగా ఆ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు తమ ప్రాంతం నుంచి వచ్చినా, ఇక్కడి వారి నుంచే వచ్చినా రకరకాలుగా సమర్థిస్తారు.
రెండవవారు, కాళోజీ హెచ్చరించినట్టు ప్రాంతం వాడే దోపిడి చేయడం. వారిలో కొందరు నిన్న, నేడు కూడా తెలంగాణ అస్తిత్వం పట్ల స్పృహ, ప్రేమ లేనివారు. ఇన్ని దశాబ్దాలుగా ఇంతింత జరిగినా అవి లేని వారికి మునుముందు కలుగుతుందని ఎంతమాత్రం ఆశించలేము. మరికొందరు అస్తిత్వ స్పృహను నటించి, అవసరార్థం ఉపయోగించుకొని, అవసరార్థం తిరిగి వదలివేస్తున్నవారు, లేదా మౌనం వహిస్తున్నవారు. లేదా బయటి వారికి ఉపయోగపడుతూ లాభం పొందజూసే కాంప్రడారు.్ల అందుకు రకరకాల సాకులు వెతుకున్నవారు. తెలంగాణ స్పృహ అన్నది దేశభక్తి లానే తెలంగాణ భక్తి అన్నమాట.
అటువంటి భక్తిని వదిలివేయటానికి అసలు ఏ సాకులైనా ఉంటాయా? పార్టీల భక్తో, నాయకుల పట్ల భక్తో అక్కరలేదు. కానీ, తమ నేల, దాని మనుగడ పట్ల భక్తిని వదిలే వారికి మౌలికమైన స్పృహ ఉన్నట్టా? ఇంకొందరు అస్తిత్వాలు, స్పృహల గురించిన ప్రాథమిక అవగాహనలు లేక తమకు తెలియకుండానే తెలంగాణ మనుగడకు, భవిష్యత్తుకు హాని చేస్తున్నవారు.
ఈ విధమైన నేటు పరిణామాలు, చాటు పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతుండటం పట్ల ఆందోళన కలుగుతున్నందునే ఆలోచనాపరులలో తెలంగాణ అస్తిత్వ చర్చలు ఇటీవల మొదలయ్యాయి. జరుగుతున్న నష్టాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా కనిపిస్తున్నాయి. సామాన్యులు కూడా నగరాల్లో, గ్రామాల్లో తమ అనుభవంలోకి వచ్చిన మేరకు ఈ విషయాలను ముచ్చటించటం వినవస్తున్నది. ఈ నష్టాలను ఎవరైనా క్రోడీకరించి రాస్తే పెద్ద జాబితానే అవుతుంది. ఈ పరిణామాలను తెలంగాణ అస్తిత్వ స్పృహతో ప్రతిఘటించవలసిన సమయం ఆసన్నమైంది. ఆలోచనాపరులు, ప్రజలు కూడా స్వరాష్ట్రం సాధించుకోవటంతో ఉనికి, మనుగడతో కూడిన అస్తిత్వం అనే దృక్పథానికి సంబంధించి ఇక అంతా సిద్ధించిందని, అది శాశ్వత స్థితి కాగలదని అపోహపడ్డారు. దానితో నిర్లిప్తత ఆవరించింది. కానీ అది సరికాదని అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల, అస్తిత్వ చైతన్యం నిరంతరం కావలసి ఉన్నది.
-టంకశాల అశోక్