Wegovy | ఊబకాయం నియంత్రణలో విస్తృతంగా ఉపయోగిస్తున్న బరువు తగ్గించే ఔషధం వెగోవీ (Wegovy) గురించి తాజాగా వెలువడిన ఒక అధ్యయనం వైద్య రంగంలో చర్చనీయాంశమైంది. ఈ ఔషధం వినియోగం, ఆకస్మిక దృష్టి నష్టం కలిగించే అరుదైన కంటి సమస్య మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే వెగోవీ నేరుగా అంధత్వానికి కారణమవుతుందని అధ్యయనం పేర్కొనలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెగోవీలో సెమాగ్లుటైడ్ (Semaglutide) అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ వర్గానికి చెందిన ఔషధం. ఊబకాయం, అధిక బరువును నియంత్రించడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే, దీని దీర్ఘకాలిక ప్రభావాలపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా అధ్యయనం వెలుగులోకి వచ్చింది.
ఈ పరిశోధన బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీలో ప్రచురితమైంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించే అడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ (FAERS)లో నమోదైన 2017 నుంచి 2024 వరకు 3 కోట్లకుపైగా నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. వీటిలో 31 వేలకుపైగా నివేదికలను సెమాగ్లుటైడ్ ఆధారిత మందులకు సంబంధించినవిగా గుర్తించారు. అధ్యయనంలో వెగోవీతోపాటు ఓజెంపిక్ (Ozempic), రైబెల్సస్ (Rybelsus) వంటి సెమాగ్లుటైడ్ ఔషధాలను పోల్చి పరిశీలించారు. అందులో వెగోవీ వినియోగదారుల్లో ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (Ischemic Optic Neuropathy – ION) అనే కంటి వ్యాధికి సంబంధించిన సంకేతాలు అత్యధికంగా కనిపించినట్లు గుర్తించారు. ఓజెంపిక్కు సంబంధించి మొత్తం నివేదికలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వెగోవీతో అనుబంధమైన ప్రమాద సంకేతం దాదాపు ఐదు రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి సాధారణంగా కనిపించని తీవ్రమైన కంటి వ్యాధి. కంటినుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని పంపించే ఆప్టిక్ నర్వ్కు రక్తప్రసరణ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని కొన్నిసార్లు ఐ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య వచ్చినప్పుడు అకస్మాత్తుగా చూపు మసకబారడం, కంటిచూపులో నల్లని మచ్చలు కనిపించడం, రంగులను గుర్తించే సామర్థ్యం తగ్గిపోవడం లేదా ఒక్క కంటిలో వేగంగా చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ నష్టం శాశ్వతంగా మారే ప్రమాదం ఉంటుంది. వెగోవీతో ప్రమాదం ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణం దాని మోతాదు కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. వెగోవీని సాధారణంగా బరువు తగ్గించేందుకు అధిక మోతాదులో ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఈ అధిక మోతాదులు రక్తపోటు, శరీర ద్రవాల సమతుల్యత లేదా రక్తప్రసరణపై ప్రభావం చూపి ఆప్టిక్ నర్వ్కు హాని కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ ప్రమాద సంకేతాలు మరింత ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు. వెగోవీ వాడుతున్న పురుషుల్లో ఈ కంటి వ్యాధితో సంబంధం బలంగా కనిపించగా, మొత్తం ప్రమాద స్థాయి మహిళల కంటే మూడింతలు అధికంగా ఉన్నట్లు విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పరిశోధకులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఫలితాల ఆధారంగా వెంటనే చికిత్స మార్గదర్శకాలను మార్చాల్సిన అవసరం లేదు. మరింత విస్తృత స్థాయి అధ్యయనాలు అవసరమని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం వెగోవీ వాడుతున్న వారు ఆకస్మికంగా చూపు మసకబారడం, కంటిలో నల్లని మచ్చలు కనిపించడం, పక్క చూపు తగ్గిపోవడం లేదా ఇతర దృష్టి సమస్యలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఈ ఔషధం ఊబకాయం చికిత్సలో ఇప్పటికీ ప్రయోజనకరంగానే ఉందని, ఈ కంటి సమస్య చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా ఔషధాన్ని ఆపివేయకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు.