ఎర్రుపాలెం, జూన్ 06 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పలువురు రైతుల బర్రెలను దొంగతనంగా తరలిస్తూ పట్టుబడ్డ నలుగురిని ఎర్రుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మధిర రూరల్ సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న రాజుపాలెంకి చెందిన చప్పిడి రాధాకృష్ణ ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ కుమార్ తన సిబ్బందితో శనివారం ఉదయం పెద్ద గోపవరం లింక్ రోడ్డు సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు అశోక లైలాండ్ లను తనిఖీ చేయగా సంతకు తరలించే రెండు బర్రెలు, ఒక దూడను గుర్తించారు. విచారించగా బర్రెల దొంగతనం విషయం వెలుగుచూసింది. దీంతో పెనుగంచిప్రోలుకు చెందిన కంభం సాయి, పెనుగొండ సాయి, ఓర్సు గోపాలకృష్ణ, ముద్రకోల గోపీచంద్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా నిందితుల్లో పలువురు పరారీలో ఉన్నట్లు సీఐ మధు తెలిపారు. గంపలగూడెం, బోనకల్లు, చింతకాని తదితర గ్రామాల్లో తరచు బర్రెలు, మోటార్ల దొంగతనం జరుగుతున్న నేపథ్యంలో నిఘాను పటిష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.