Ford | అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్ (Ford)’ తిరిగి భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి సంకేతాలిచ్చింది. చెన్నైలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను విదేశాలకు తమ కార్ల ఎగుమతి కోసం ఉపయోగించుకోవాలని ఫోర్డ్ యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వానికి కూడా అధికారికంగా సమాచారం ఇచ్చింది. 2021లో భారత్‌లో కార్ల తయారీ నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్ ప్రకటించింది. కానీ, తాజాగా ఎగుమతుల కోసం చెన్నై మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ధృవీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి ‘లెటర్ ఆఫ్ ఇండెంట్’ అందజేసింది ఫోర్డ్. అమెరికాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పర్యటిస్తున్నప్పుడు.. ఫోర్డ్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం.
‘ఫోర్డ్ + గ్రోత్’ ప్లాన్‌లో భాగంగా చెన్నై మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించామని ఫోర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ గ్రూప్ ప్రెసిడెంట్ కే హార్ట్ తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని యూనిట్ లో సుమారు 12 వేల మంది గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ విభాగంలో పని చేస్తున్నారు. తాజాగా కంపెనీ నిర్ణయంతో వచ్చే మూడేండ్లలో మరో 2,500-3,000 మందికి ఉపాధి లభించనున్నది. గుజరాత్ లోని సనంద్ యూనిట్ లో ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్ ఆపరేషన్స్ తోపాటు ప్రపంచంలోకెల్లా ఫోర్డ్ అత్యధిక ఉద్యోగాలు కల్పించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్ లో పట్టు సాధించేందుకు దాదాపు మూడు దశాబ్దాల ప్రయత్నం తర్వాత కార్ల తయారీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు 2021 సెప్టెంబర్ లో ఫోర్డ్ ప్రక టించింది. గుజరాత్ లోని సనంద్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను టాటా మోటార్స్ కు ఫోర్డ్ విక్రయించింది.