హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నరకు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్తించింది. ఏకంగా 24 వేల ఎకరాలను చెరబట్టేందుకు స్కెచ్ వేసింది. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే గుర్తించిన ‘నమస్తే తెలంగాణ’ ‘లక్షన్నర ఇండ్లకు కాంగ్రెస్ రెడ్ మార్క్’ వేసిందని కుండబద్ధలు కొట్టింది. మూసీ నది పేరిట రేవంత్‌రెడ్డి ఆడుతున్న దాగుడుమూతలను పటాపంచెలు చేస్తూ నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర విస్తరించి ఉన్న నిర్మాణాలన్నింటిపై ప్రభావం ఉంటుందనే అంశం తాజా సర్వేతో తేలిపోయింది.
ఇదే తీరుగా హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట ఇరువైపులా కిలోమీటర్ వెడల్పుతో భూసేకరణ చేస్తే నగరంలో నేలమట్టమయ్యే నిర్మాణాల సంఖ్య లక్షన్నర దాటిపోతుందని తేటతెల్లమవుతున్నది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు కూడా స్పష్టం చేస్తూ కిస్మత్‌పురా గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్లను నోటిఫై చేశారు. సర్వే నంబర్ 115 నుంచి 126 వరకు మూసీ మధ్య స్థానం నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఆ భూములున్నాయి. ఇదే తీరుగా నది వెంబడి భూసేకరణ చేస్తే లక్షలాది కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ మూసీ నదిలో కలిపేయనున్నదనీ స్పష్టమవుతున్నది.
లక్షన్నర కోట్లతో చేపట్టే మూసీ సుందరీకరణ కోసం లక్షన్నరకు పైగా కుటుంబాలను బలిపీఠం ఎక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నది. మూసీ పేరిట మసిపూసి మారేడుకాయ చేస్తున్నదనే ఆరోపణలకు బలం చేకూర్చేలా హైదరాబాదీల జీవితాలను ఆగం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సోమవారం అడుగులు వేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కేవలం 3,200 ఎకరాలే సేకరిస్తామని, 10 వేల నిర్మాణాలే ప్రభావితమవుతాయని డిసెంబర్లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నది. నిజానికి ఈ సంఖ్య ఏకంగా లక్షన్నరకు పైనే ఉంటుందని స్పష్టమవుతున్నది.
నిరుడు ప్రజాసంఘాలతో నిర్వహించిన సమావేశంలో మూసీ సుందరీకరణ ప్రజంటేషన్‌లోనే నదికి ఇరువైపులా కిలోమీటరు చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వివరించింది. కానీ ఇదే విషయాన్ని అప్పటి నుంచి గోప్యంగా ఉంచిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా గండిపేట మండలం కిస్మత్‌పురా గ్రామ పరిధిలో భూ సర్వే కోసం గుర్తించిన సర్వే నంబర్లతో అసలు కుట్ర బయటపడింది. రివర్ బెడ్, బఫర్ జోన్ వరకు ప్రత్యామ్నాయాలు చూపి, అక్కడి నుంచి కిలోమీటరు వెడల్పు పరిధిలో ఉండే భూములను కూడా మూసీ కోసం వినియోగించుకోవాలని చూస్తున్నది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు విస్తరించాలని సర్కార్ భావిస్తున్నది. తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును తెరమీదికి తెచ్చింది. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్లో 28 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపడుతామని తెలిపింది. తాజా సర్వే మాత్రం కిలోమీటరు వెడల్పుతో ఉండటంతో, గౌరెల్లి వరకు ఇదే తీరుగా భూముల సేకరణ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరుగా హిమాయత్ సాగర్ కింద నుంచి బాపూఘాట్ వరకు విస్తరించి ఉన్న కిస్మత్పుర, భరత్ నగర్ కాలనీ, బాబమ్మ కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, సికిందర్గూడ, నదికి మరోవైపు ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, న్యూ గ్రీన్ సిటీ, భగవత్ గూడ, జనచైతన్య కాలనీ, గోల్డెన్ హైట్స్ కాలనీ, వెంకటసాయి కాలనీ, నలంద నగర్ వరకు ప్రభావితం కానున్నది.
గండిపేట కింద కూడా ఇదే తీరుగా భూసేకరణ చేస్తే నార్సింగి నుంచి మొదలుకొని, తారామతి బారాదరి, రాందేవ్ గూడ, మక్కీ దర్వాజా, మధు పార్క్ రిడ్జ్, సలేహ్ నగర్, హసీం నగర్, బాపూఘాట్ నుంచి గౌరెల్లి వరకు ఉన్న కాలనీలు, బస్తీలన్నింటినీ ప్రభుత్వం మూసీలో కలిపేయనున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములను సేకరించి అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ నదికి కిలోమీటరు దూరంలో ఉన్న భూముల్లో గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందనే ఆరోపణలున్నాయి.
తాజా మూసీ కోసం ‘కిలోమీటరు వెడల్పు సర్వే’ నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇప్పటికే బాపూఘాట్ వద్ద భూసేకరణ చేసేందుకు మధు పార్క్ రిడ్జ్ నిర్మాణ సముదాయానికి నోటీసులు జారీ చేయడంతో ప్రజలు బెంబూలెత్తిపోతున్నారు. గౌరెల్లి వరకు కిలోమీటరు వెడల్పుతో మూసీ వెంట భూ ములను సేకరిస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి రానున్నది. తాజా సర్వేతో ఇక తమ ఆస్తులకు రక్షణ లేదనీ, పట్టా భూముల్లో కట్టుకున్న ఇం డ్లకు సర్కార్‌తో ముప్పు పొంచి ఉన్నదని ప్రభావిత ప్రాంతాలవారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ లెక్కన మూసీకి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాం తాలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నది.
మూసీ సుందరీకరణ పేరిట వేలాది ఎకరాల భూములను చెరబట్టేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పరీవాహక ప్రాంతాల్లో పలుచోట్ల సర్వేలు, నోటిఫికేషన్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్‌పురా ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారని తెలుసుకున్న భూముల యజమానులు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 40 మంది రైతులకు కిస్మత్‌పురా పరిధిలోని సర్వేనంబర్ 117లో 250 గజాల చొప్పున ప్లాట్లు పంపిణీ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు 2008లో అందుబాటులోకి రాగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం కింద ప్లాట్లు ఇచ్చింది. ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు సర్వే చేపట్టింది. ఈ సర్వేను అడ్డకునేందుకు ప్లాట్ల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘అప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది.. ఇప్పుడు అదే ప్రభుత్వం ప్లాట్లు తీసుకుంటున్నది.. ఇదెక్కడి తీరు?’ అంటూ నిలదీశారు. అప్పటి ప్రభుత్వం తమకు ఉచితంగా ఏమీ ఇవ్వలేదని.. తమ భూములు తీసుకుని పరిహారంగా ప్లాట్లు ఇచ్చిందని చెప్తున్నారు. మూసీ నదికి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న తమ ప్లాట్లను తీసుకొని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే తమ భూములను రేవంత్‌రెడ్డి లాక్కుంటున్నాడని మండిపడ్డారు. మూసీ పేరిట ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలనా? అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకోబోమని తేల్చిచెప్పారు. ‘ఇక్కడికి అధికారులెవరూ రావొద్దు.. గ్రామ సభల్లోనూ మూసీ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని చెప్పినా సర్వేకు ఎందుకు వస్తున్నరు?’ అని మండిపడ్డారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, దొంగచాటుగా వచ్చి ఎలా సర్వే చేస్తారని నిలదీశారు.
ఏడాది క్రితమే మూసీ మార్కింగ్ కోసం రూపొందించిన జియోగ్రాఫికల్ మ్యాపులు అప్పట్లోనే కలకలం రేపాయి. దీని ప్రకారం మూసీ నదిని రెడ్, బ్లూ, బఫర్‌జోన్‌తోపాటు, ఫుల్ రివర్ లెవల్‌ను సర్కార్ పేర్కొన్నది. అయితే ఈ పరిధి దాదాపు కిలోమీటరు వెడల్పు ఉంటుందని తేలింది. కానీ ఈ అంశాన్ని దాచిపెట్టిన ప్రభుత్వం సంవత్సరం తర్వాత మరోసారి నదికి కిలోమీటరు దూరంలో ఉన్న భూముల సర్వేకు అధికారులను పంపడంతో అసలు వాస్తవం బయటపడింది. కిస్మత్‌పురా గ్రామ పరిధిలోని భూముల సర్వే నోటిఫికేషన్లో పేర్కొనట్టుగా సర్వే నంబర్ 115 నుంచి 126 వరకు గుర్తించారు. ఈ ప్రకారం మూసీ నది నుంచి కిస్మత్పుర గ్రామ పరిధి సగం వరకు ప్రభావితం కానున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటరు పొడవునా భూమిని సేకరిస్తే దాదాపు గెజిట్‌లో పేర్కొన్నట్టుగా 3,200 ఎకరాలు మాత్రమే కాదనీ, దీని విస్తీర్ణం ఏకంగా 24 వేల ఎకరాలకు చేరుతున్నదనే అంచనాలు ఉన్నాయి.
కేసీఆర్‌ను ఓడించి తప్పు చేసినం. కేసీఆర్ విలువ మాకు ఇప్పుడు తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డిని గెలిపించి పెద్ద తప్పుచేసినం. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు తిరిగి సంపాదించేందుకు మా ఇండ్లు కూల్చి మా భూములు లాక్కుంటున్నడు. మూసీ సుందరీకరణకు మా భూములకు సంబంధం ఏంది? మమ్మల్ని వేధించి భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నది. కేసీఆర్ పదేండ్లలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. రేవంత్‌రెడ్డి రెండేండ్లలో చేసిన పాలనంతా కూల్చడం, లాక్కోవడమే.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌నే గెలిపించుకుంటం. ఆయన వస్తేనే మాకు మేలు జరుగుతది.
-మూసీ బాధితుడు, కిస్మత్పూర్