Manu Bhaker : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) స్వదేశంలో షూటింగ్ వరల్డ్ కప్(Shooting World Cup)లోనూ మెడల్స్ కొల్లగొడుతుందని అంతా అనుకున్నారు. కానీ, అందరికీ షాకిస్తూ ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతకధారిగా పాల్గొన్న ఆమె కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది.
విశ్వ క్రీడల్లో రెండు కాంస్యాలతో మెరిసిన భాకర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోనుంది. దాంతో, వరల్డ్ కప్ పోటీలకు ఆమె దూరం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం ఆమె కోచ్, మాజీ షూటర్ జస్పాల్ రానా (Jaspal Rana) వెల్లడించాడు.
మను భాకర్, జస్పాల్ రానా
‘అక్టోబర్‌లో జరుగనున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భాకర్ పాల్గొంటుందా? లేదా? అనేది తెలియదు. ఎందుకంటే ఆమె మూడు నెలలు బ్రేక్ తీసుకోనుంది. ఇది సాధారణ విరామమే. ఒలింపిక్స్ లక్ష్యంగా భాకర్ సుదీర్ఘ రోజులు శిక్షణ తీసుకుంది’ అని రానా తెలిపాడు. ఢిల్లీ వేదికగా అక్టోబర్‌లో షూటింగ్ వరల్డ్ కప్ ఆరంభం కానుంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 18వ వరకూ పోటీలు జరుగుతాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భాకర్.. పారిస్‌లో పతక గర్జన చేసింది. కోచ్ జస్పాల్ రానా సలహాలతో ఆటలో మెరుగైన భాకర్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో మను భాకర్ కంచు మోత మోగించింది. తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది. అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్లో మళ్లీ సత్తా చాటిన ఆమె కాంస్యంతో మెరిసింది.