Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్‌లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. అయితే, మను భాకర్ విజయం కేంద్రం నేతృత్వంలోని ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమం ఫలితమేననని కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ సందర్భంగా మను భాకర్‌ను ఆయన అభినందించారు. ఆమె భారత్‌కు పతకాన్ని సాధించందన్న ఆయన.. ఖేలో ఇండియాలో భాకర్ శిక్షణ పొందినట్లు తెలిపారు. దేశం క్రీడల్లో పురోగతి సాధించేందుకు చిన్నారులు, యువతలోని ప్రతిభను గుర్తించాలని ప్రధాని మోదీ నిర్ణయించారన్నారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, జాతీయ క్రీడలు నిర్వహించాలని.. అప్పుడే దేశం క్రీడల్లో పురోగమిస్తుందన్నారు. అందుకే బడ్జెట్లో ఖేలో ఇండియాకు రూ.900కోట్లకుపైగా కేటాయించారన్నారు.
ఒలింపిక్స్ క్రీడలకు ముందు మను భాకర్ ప్రధానిని కలిసిన సమయంలో ఖేలో ఇండియా కార్యక్రమం తనలాంటి చాలామంది క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడుతుందని చెప్పినట్లుగా తెలిపారు. ఖేలో ఇండియాలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయని.. కీర్తి ప్రాజెక్టు ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లోని ప్రతిభను గురించి వారికి సరైన శిక్షణ, వసతి కల్పించడంతో పాటు అవసరమైన ఖర్చులను చూసుకుంటున్నామన్నారు. క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించాక టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ (TOP’s)లో చేర్చి.. అంతర్జాతీయ ఆడే అవకాశాలు కల్పించడంతో పాటు కోచ్‌ల నేతృత్వంలో శిక్షణ లభిస్తుందన్నారు.
మను భాకర్‌కు మంచి శిక్షణ ఇచ్చామని.. ఎలాంటి ఆర్థిక అవరోధాలు కలుగకుండా టాప్స్ పథకం కింద ఏర్పాట్లు చేశామన్నారు. భాకర్ శిక్షణ కోసం దాదాపు రూ.2కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్‌కు పంపారన్నారు. ఆమె కోరుకున్న కోచిను నియమించుకోవాల్సిన అవసరం ఉందని.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా క్రీడాకారులందరికీ ఈ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఆటగాళ్లతోపాటు వ్యక్తిగత కోచ్‌లను పంపాలన్న నిర్ణయాన్ని మంత్రి సమర్థించారు. ఇంతకుముందు జట్టు సహాయక సిబ్బంది, కోచ్‌లకు ఆటగాళ్లతో ప్రయాణించడానికి పరిమిత సౌకర్యాలు ఉండేవని.. ఈ సారి ఆటగాళ్లతో పాటు వారి వ్యక్తిగత కోచ్‌లను పంపాలని నిర్ణయించామన్నారు. ఆటగాళ్లు బాగా రాణిస్తే దేశ నైతిక స్థయిర్యం కూడా పెరుగుతుందని, మన ఆటగాళ్లు దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకం నాకుందని పేర్కొన్నారు.