Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్(Manu Bhaker) గురికి తిరుగే లేకుండా పోయింది. ఇప్పటికే రెండు కాంస్య పతకాల(Bronze Medals)తో చరిత్ర సృష్టిచిన మను మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అదరగొట్టిన మను ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్టు 3 ఆదివారం ఫైనల్ జరుగనుంది.
శుక్రవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత పోటీల్లో మను భాకర్ అదరగొట్టింది. 590 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. హంగేరికి చెందిన వెరోనికా మేజర్ 592 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఎన్నో ఆశలతో ఒలింపిక్స్‌కు వచ్చిన తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్(Esha Singh) తీవ్రంగా నిరాశపరిచింది. ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన ఆమె 581 పాయింట్లు సాధించి 18వ స్థానానికే పరిమితమైంది.
🚨 Breaking News! @realmanubhaker 🇮🇳 shoots a stunning score of 590 (294+296) to advance to the finals in Women’s 25m Pistol at the Paris Olympics! 🌟🏆 #Paris2024 pic.twitter.com/qnJDP8cx1e
— indianshooting.com (@indianshooting) August 2, 2024
విశ్వ క్రీడల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను భాకర్ హవా బుల్లెట్లా దూసుకుపోతోంది. ఈవెంట్‌తో సంబంధం లేకుండా పతకాల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కంచు మోత మోగించిన మను.. ఆ తర్వాత మిక్స్డ్ విభాగంలోనూ పతకంతో చరిత్ర సృష్టించింది. యువ షూటర్ సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh)తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ పోటీల్లో దేశానికి కాంస్య పతకం సాధించి పెట్టింది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా మను భాకర్ కొత్త చరిత్ర లిఖించింది.