Vallabhaneni Vamsi | వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన వాహనాన్ని వెంబడించిన పోలీసులు.. ఆయన ఇంటికి సమీపంలోనే అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నాయకులపై దాడి చేశారు. అనంతరం వారి వాహనాలను తగులబెట్టారు. దాదాపు 5 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కాకపోతే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ప్రోద్బలంతోనే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసును సీరియస్‌గా తీసుకుంది.
టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఇప్పటికే 18మందిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వంశీని అదుపులోకి తీసుకున్నారు.