స్లోవేనియా: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నీ రెండో అంచె పోటీలలో భారత స్టార్ ప్యాడ్లర్లు మనికా బాత్రా, మానవ్ ఠక్కర్‌కు ఆరంభ రౌండ్లలోనే నిరాశ ఎదురైంది. స్లోవేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ముగిసిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మనికా.. 0-3 (9-11, 6-11, 4-11)తో హి ఝుజియ (చైనా) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
తొలి రౌండ్లో 3-0తో ఫు యు (పోర్చుగల్)ను ఓడించిన మణికా.. చైనా అమ్మాయి ముందు తేలిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మానవ్ ఠక్కర్.. 0-3తో యు ఫి (చైనా) చేతిలో ఓడాడు. అంతకుముందు పురుషుల డబుల్స్‌లో మానవ్, మనుష్ షా జంట సైతం.. తొలి రౌండ్లో 1-3తో (10-12, 6-11, 11-8, 6-11)తో కొరియన్ ద్వయం కిమ్ మిన్హెక్-పార్క్ గంగ్హెన్ జోరు ముందు నిలువలేకపోయింది.