IPL Mega Auction : ఇండియన్ ప్రీమియర్ మెగా వేలానికి రోజులు దగ్గరపడుతున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25న మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు రంజీ ట్రోఫీ వేదికగా కుర్రాళ్లు ప్రతాపం చూపిస్తున్నారు. పరుగుల వరద పారిస్తూ వేలంలో అమ్ముడుపోయేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. తమను వదిలేసిన ఫ్రాంచైజీలు బాధ పడేలా రంజీల్లో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. వాళ్లలో ఒకడు మహిపాల్ లొమ్రోర్.
పదిహేడో సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన ఈ యువకెటరం రంజీల్లో జూలు విదిల్చాడు. రాజస్థాన్ తరఫున చెలరేగిపోతూ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. గురువారం ఉత్తరాఖండ్ బౌలర్లను ఊచకోత కోసిన మహిపాల్ 357 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ 13 సిక్సర్లు, 25 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతడు 300 పరుగులతో అజేయంగా నిలవగా.. కార్తిక్ శర్మ(113) శతకంతో చెలరేగాడు. ఈ ఇద్దరి మెరుపు బ్యాటింగ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 660 పరుగులు చేసింది.
🚨 TRIPLE HUNDRED FOR MAHIPAL LOMROR…!!!! 🚨
He smashed an Incredible Triple Hundred in just 357 balls in this Ranji Trophy for Rajasthan.
– Mahipal Lomor, Take a bow! 🙇 pic.twitter.com/sHt9U8G3c8
— Tanuj Singh (@ImTanujSingh) November 14, 2024
ఐపీఎల్లో మహిపాల్ రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీలకు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్థాన్ తరఫున 4 సీజన్లు ఆడిన మహిపాల్‌ను 2022 మెగా వేలంలో బెంగళూరు దక్కించుకుంది. దాంతో అతడు మూడు సీజన్లు ఆర్సీబీ జెర్సీతో ఆడాడు. 2022, 2024 వరకూ బెంగళూరుకు ఆడిన ఈ కుర్రాడు అదరగొట్టాడు. 17వ సీజన్లో అయితే. 10 మ్యాచుల్లో 183.82 స్ట్రయిక్ రేటుతో 125 పరుగులు సాధించాడు. అయితే.. ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న బెంగళూరు యాజమాన్యం ఈసారి స్క్వాడ్‌ను మొత్తానికే మార్చేయాలనుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రజత్ పాటిదార్లను మాత్రమే అట్టిపెట్టుకుంది.