Rinku Singh New House : ఐపీఎల్‌తో స్టార్ అయిపోయిన రింకూ సింగ్ (Rinku Singh) ఒక్కొక్కటిగా తన కలలను నిజం చేసుకుంటున్నాడు. ఐపీఎల్ డబ్బులతో ఇప్పటికే పేదపిల్లల కోసం అన్ని వసతుల హాస్టల్ కట్టించిన రింకూ.. ఈమధ్యే కొత్తగా ఇల్లు కొన్నాడు. ఇల్లంటే సాదాసీదా ఇల్లు కాదండోయ్.. అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి. అలీగఢ్‌లో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రింకూ ఇల్లు రాజభవనాన్ని తలపిస్తోంది. ఇంతకూ ఈ డాషింగ్ హిట్టర్ నూతన గృహం విశేషాలు ఏంటో తెలుసా..?
అలీగఢ్‌లోని గోల్డెన్ ఎస్టేట్‌లో రింకూ రూ.3.5 కోట్లతో కొన్న ఇంటిలో ఆరు పడక గదులు, హాయిగా సేదతీరేందుకు ఈత కొలను ఉన్నాయి. విశాలమైన హాలు, డైనింగ్ టేబుల్‌తో పాటు స్నేహితులతో, బంధువులతో టెర్రస్ మీద పార్టీలు చేసుకునేందుకు బార్.. ఇలా అన్ని వసతులు ఉండేలా చూసుకున్నాడు రింకూ. నంబర్ 5వ తేదీన గోల్డెన్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధుల నుంచి ఇంటి తాళాలు అందుకున్న రింకూ.. అనంతరం తన డ్రీమ్ హోమ్ గురించి వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు.
అందులో తాను ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన బ్యాట్‌ను గుర్తుగా దాచుకున్నాడు. ఆ పక్కనే తన క్రికెట్ కెరీర్‌లోని ముఖ్య సంఘటనలు, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్‌తో దిగిన ఫొటోలను వరుసగా పేర్చాడు. మొత్తానికి ఇంద్ర భవనంలా సకల హంగులతో కూడిన రింకూ ఇల్లు సూపర్‌గా ఉందంటున్నారు అభిమానులు.
పవర్ హిట్టర్ అయిన రింకూ సింగ్ జీవితం ఐపీఎల్‌తో మారిపోయింది. ఒకప్పుడు తండ్రికి ఇష్టం లేకున్నా క్రికెట్ ఆడిన రింకూ ఇప్పుడు కన్నవాళ్లు గర్వించే స్థాయికి ఎదిగాడు. అయినా సరే అతడి తండ్రి ఇప్పటికీ ఆటోలో ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు వేసే పని మాత్రం ఆపలేదు. నిరుడు టీమిండియా జెర్సీ వేసుకున్న రింకూ తనదైన స్టయిల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అలరించాడు. ఇక 17వ సీజన్లో రింకూ పెద్దగా రాణించలేదు.
అయినా సరే.. అతడిపై నమ్మకంతో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు అట్టిపెట్టుకుంది. మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగే రింకూను కోల్‌కతా ఫ్రాంచైజీ ఏకంగా రూ.13 కోట్లకు రీటైన్ చేసుకుంది. ఫ్రాంచైజీ నుంచి భారీ సొమ్ము రానుండడంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ తన కొత్త ఇంటి కలను సాకారం చేసుకున్నాడు.