భోపాల్: ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత హింస జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో దళిత గ్రామంలోని ఇళ్లకు నిప్పుపెట్టారు. (Dalit Village Set On Fire) భయాందోళన చెందిన దళితులు స్థానిక పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. మధ్యప్రదేశ్లోని విజయ్పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. గోహతా గ్రామంలో పోలింగ్ తర్వాత ఓటు వేయకపోవడం, బూత్ కబ్జా ఆరోపణలపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. దళితులపై రాళ్లు రువ్వారు. వారి ఇళ్లకు నిప్పుపెట్టారు.
కాగా, భయాందోళన చెందిన దళిత గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే తమ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దళితులు ఆరోపించారు.