Litton Das : బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్(Litton Das) స్వదేశంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నాడు. నెల క్రితం అల్లర్లతో అట్టుడుకిన బంగ్లాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందువు అయిన లిట్టన్.. కుటుంబంతో కలిసి ఇంట్లో గణపయ్యను పూజించాడు. ఆ ఫొటోలను అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘గణేశుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది’ అనే అర్థం వచ్చేలా లిట్టన్ దాస్ ఆదివారం ఓ పోస్ట్ పెట్టాడు. ‘వినాయకుడు మీకు శక్తిని ఇచ్చుగాక. మీ బాధలన్నీ తొలగించుగాక. మీ జీవితంలో సంతోషాన్ని నింపుగాక’ అంటూ లిట్టన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. బంగ్లా ఓపెనర్ పోస్ట్ చూసిన అభిమానులంతా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో శతకంతో చెలరేగిన లిట్టన్ త్వరలోనే భారత పర్యటన కోసం జట్టుతో కలువనున్నాడు. సెప్టెంబర్ 19న భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.
పాకిస్థాన్‌తో రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో వికెట్‌కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ (138) శతకంతో గర్జించాడు. అతడి అండగా ఆల్‌రౌండర్ మెహిది హసన్ మిరాజ్ (78) సమయోచిత ఇన్నింగ్స్ ఆడడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత పాక్‌ను ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌పై తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
లిట్టన్ దాస్ (138)
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఈమధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) పార్టీకి చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలతో పాటు హిందువులే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారు. అంతేకాదు ఎందరినో పొట్టనబెట్టుకున్నారు కూడా.
ఈ సమయంలోనే ఆందోళనకారులు లిట్టన్ దాస్ ఇంటిని కూడా తగులబెట్టారనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, అవన్నీ వదందతులని, తామంతా క్షేమంగానే ఉన్నామని బంగ్లా ఓపెనర్ ఓ పోస్ట్ పెట్టాడు. ఎట్టకేలకు నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(Mohammad Yunus)అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడంతో బంగ్లాదేశ్‌లో మారణకాండ ఆగింది. అప్పటికే ఆ దేశంలో ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి.