BAN vs SA 1st Test : మిర్పూర్ వేదికగా సాగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 106 పరుగులకే పరిమితం చేసిన సఫారీ జట్టు.. భారీ ఆధిక్యం సాధించింది. వికెట్ కీపర్ కైల్ వెర్రినే (114) రికార్డు శతకంతో బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాడు. తద్వారా బంగ్లాదేశ్‌పై శతకం బాదిన తొలి దక్షిణాఫ్రికా వికెట్ కీపర్‌గా వెర్రినే చరిత్ర సృష్టించాడు. అంతేకాదు పదో వికెట్ కీపర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా పోరాడుతోంది. రబడ(2/10) చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇంకా 101 రన్స్ వెనకబడి ఉంది. సొంతగడ్డపై పులిలా గర్జించే బంగ్లాదేశ్ ఓటమి తప్పించుకునేదుకు పోరాడుతోంది. మిర్పూర్ టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ల జోరుతో తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డు మూటగట్టుకున్న బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 కీలక వికెట్లు కోల్పోయింది.
Kyle Verreynne’s century has given South Africa a 200+ run lead in Mirpur 📈https://t.co/8YYOAEQG55 #BANvSA pic.twitter.com/MmyJ7wL4UP
— ESPNcricinfo (@ESPNcricinfo) October 22, 2024
ప్రస్తుతం ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్(38), సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం(31)లు క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఈ ఇద్దరూ.. తర్వాత వచ్చే లిటన్ దాస్, మిరాజ్‌లు ఎంత సేపు ఆడుతారు? అనే దానిపై బంగ్లాదేశ్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పుతుందా? లేదా? తెలియనుంది.
అంతకుమందు కైల్ వెర్రినే సూపర్ సెంచరీతో సఫారీలను ఆదుకున్నాడు. తైజుల్ ఇస్లాం (5/49) జోరుతో 99 పరుగులకే 5 వికెట్లు పడిన జట్టును కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోర్ దిశగా నడిపాడు. వియాన్ మల్డర్(54)తో కలిసి దక్షిణాఫ్రికాను పటిష్ట స్థితిలో నిలిపాడు. బంగ్లాదేశ్‌పై తొలి శతకంతో రికార్డు నెలకొల్పిన అతడిని మెహిదీ హసన్ మిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత హసన్ మహ్ముద్(3/66) విజృంభణతో సఫారీ జట్టు 308 పరుగుల వద్ద 10 వికెట్లు కోల్పోయింది.
After two early wickets for Rabada, Bangladesh stood their ground to finish the day 101 runs behind 🏏https://t.co/8YYOAEQG55 #BANvSA pic.twitter.com/R01F7VvWEv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 22, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే వియాన్ మల్డర్ షాకిచ్చాడు. ఓపెనర్ షద్నామ్ ఇస్లాం(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. అదే ఊపులో మొమినుల్ హక్(4), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(7)లను మల్డర్ పెవిలియన్ చేర్చాడు. అంతే.. 21 పరుగులకే బంగ్లా మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతిథ్య జట్టు బాధల్ని మరింత పెంచుతూ రబడ.. కేశవ్ మహారాజులు చెలరేగిపోయారు.