TG Weather | తెలంగాణలో రాబోయే రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. పారాదీప్‌కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీ వరకు తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించింది.
అదే రోజు రాత్రి, 25న ఉదయం ఒత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతమైన పూరీ, సాగర్ ద్వీపం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వస్తాయని.. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే, ఉపరితల ద్రోణి వాయుగుండం నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.