aహైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. మళ్లీ ప్రజలంతా వచ్చే రెండేండ్లలో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను వెయ్యిరోజులైనా నెరవేర్చకపోవడంతో ప్రధాన ప్రతిపక్షంగా తాము నిలదీస్తామన్న భయంతోనే తమను అసెంబ్లీ సమాశాల నుంచి సర్కార్ సస్పెండ్ చేసిందని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మాట్లాడారు.
మీడియా ప్రతినిధి అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. అభయహస్తం పేరిట 420 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో వందరోజుల్లో హామీలను పూర్తిచేస్తామని నమ్మబలికారని, వెయ్యి రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అని తాము నిలదీశామని, చేసిన అభివృద్ధి గురించి ఏమీ లేకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో తాము 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామని, కేవలం 4లక్షల ఓట్లు సాధించడంలో వెనకబడ్డామని, బీఆర్ఎస్ 39 సీట్లు సాధించిందని వివరించారు. రాహుల్‌గాంధీ, ఖర్గే సహా పలు కాంగ్రెస్ నేతలు రాష్ర్టానికి వచ్చి రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని రాష్ట్ర మంత్రులే ఆరోపిస్తున్నారని తెలిపారు. బాధ్యతగా ఉండాలని సీఎం రేవంత్‌కు చెప్పలేని దయనీయ పరిస్థితిలో రాహుల్‌గాంధీ ఉన్నారని పేర్కొన్నారు.
త్వరలో తేలనున్న కాంగ్రెస్ పనితనం
హైదరాబాద్‌లో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితనం ఏ పాటిదో తేలిపోతుందని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ర్టానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు మోదీ ఇమేజ్‌తోనే గెలిచారని, ఎందుకంటే వారిలో నలుగురు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలుగా పోటీచేసి బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయినవాళ్లేనని గుర్తుచేశారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, రఘునందన్‌రావు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ బరిలో ఉంటారో, లేదో? తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్లో 60లక్షల మంది కార్యకర్తలు కుటుంబ సభ్యులుగా ఉన్నారని, కేసీఆర్ తన జీవితమంతా పార్టీకే అంకితం చేశారని తెలిపారు. 14 ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించారని, పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపారని, గెలుపోటములు ఏ పార్టీకైనా సహజమేనని, ఓటమి ఏ ఒక్కరిదీ కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్దే విజయమని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం అన్ని విధాలా అభివృద్ధి సాధించిందని తెలిపారు. నగరం నలుమూలల ఫ్లై ఓవర్లు, రోడ్లతోపాటు మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో నగరం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.