Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫిట్నెస్ లెవల్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మ్యాచ్ ముగిసేంత వరకు ఒకే ఎనర్జీతో కనిపిస్తాడు. అందుకనే ఈ స్టార్ ప్లేయర్ యో యో టెస్టు(yo yo test)లో ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. తాజాగా నిర్వహించిన ఈ టెస్టులో తనకు 17.2 పాయింట్లు వచ్చినట్లు విరాట్ పేర్కొన్నాడు.
ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు భారత ఆటగాళ్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు ఎంపికవ్వాలంటే తప్పనిసరైన యో-యో టెస్టు నిర్వహించగా.. అందులో కోహ్లీ ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని విరాట సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ
జట్టులో చోటు దక్కించుకోవాలంటే.. యో యో టెస్టు(yo yo test)లో 16.5 పాయింట్లు తప్పనిసరి. కానీ విరాట్ మాత్రం అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించాడు. జట్టు సభ్యులందరికన్నా ఎక్కువ సమయం జిమ్లో శ్రమించే విరాట్ ఫిట్నెస్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటాడు. ప్లేయర్ శారీరకంగా ఎంత దృఢంగా ఉంటే.. మానసికంగా అంత బలంగా ఉంటాడని నమ్మే కోహ్లీ.. తన హయాంలో జట్టు సభ్యులందరికీ ఫిట్నెస్ పాఠాలు ఒంటపట్టించాడు. కోహ్లీ బాటలోనే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ కూడా ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సిక్స్ ప్యాక్ బాడీలతో రాటుదేలారు.