Virat Kohli : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్లో రికార్డు ధర పలికాడు. 18వ సీజన్ కోసం విరాట్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అత్యధికంగా రూ.21 కోట్లకు అట్టిపెట్టుకుంది. దాంతో, మరోసారి కోహ్లీ ఆర్సీబీ తరఫున చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకున్న అనంతరం కోహ్లీ ఓ భావోద్వేగానికి లోనయ్యాడు.
తనకెంతో ఇష్టమైన ఫ్రాంచైజీకి మరో సీజన్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని అన్నాడు. ఆర్సీబీ యూట్యూబ్ ఛానల్లో కోహ్లీ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘నాకు ఎంత ఇష్టమే మీ అందరికీ తెలిసిందే. ఐపీఎల్లో మరే జట్టు జర్సీలో నన్ను ఊహించుకోలేను. ఒక్క ఆర్సీబీకి తప్ప ఇతర జట్లకు ఆడాలని లేదు. అయితే.. ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని ఉంది’ అని కోహ్లీ వెల్లడించాడు. 2021 సీజన్లో కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీ ఫాఫ్ డూప్లెసిస్ (Faf Duplesis) సారథ్యంలో ఆడాడు.
అయితే.. డూప్లెసిస్‌కు ప్రస్తుతం 40 ఏండ్లు. దాంతో, మళ్లీ విరాట్‌కే పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. అందుకని అతడిని భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గతంలో కోహ్లీ ఆర్సీబీని 2013 నుంచి 2021 వరకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. విరాట్ నాయకత్వంలో బెంగళూరు జట్టు 2016లో ఫైనల్ ఆడింది. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలై తొలి కప్ చేజార్చుకుంది. దాంతో.. ఎలాగైనా చాంపియన్ అనిపించుకోవాలనే కసితో ఉన్న ఆర్సీబీ ఈసారి స్క్వాడ్‌ను మార్చేయనుంది. అందులో భాగంగా కేవలం ముగ్గురినే అట్టిపెట్టుకుంది.
Retention Recap! 🧮 Today’s big news: Our plans are locked in! ✨
With 83 Crores, we have the second highest purse in the Mega auction, and 3 RTMs at our disposal.
We are all set to build an unstoppable squad! 💪
Swipe to see how we stack up against the competition… pic.twitter.com/H2JQplyRFE
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 31, 2024
మాజీ సారథి కోహ్లీని రూ.21 కోట్లకు, రజత్ పాటిదార్‌ను రూ.11 కోట్లకు. యువ బౌలర్ యశ్ దయాల్‌ను రూ.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మెగావేలంలో ఆర్సీబీ జేబులో రూ.83 కోట్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్(రూ.101 కోట్లు) తర్వాత అత్యధిక పర్స్ వాల్యూ గల ఫ్రాంచైజీ ఆర్సీబీనే. దాంతో, వేలంలో మ్యాచ్ విన్నర్లను కొనేందుకు బెంగళూరు యాజమాన్యం సిద్ధమవుతోంది.