KL Rahul | భారత స్టార్ ఓపెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్, ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటన నుంచి దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చికిత్స కోసం జర్మనీకి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. రాహుల్ ప్రస్తుతం గజ్జ గాయంతో ఇబ్బందిపడుతుండగా.. అతన్ని జర్మనీకి పంపాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) నిర్ణయించింది.
ఈ విషయాన్ని సచిన్ జైషా సైతం ధ్రువీకరించారు. రాహుల్ ఆరోగ్యాన్ని బోర్డు పర్యవేక్షిస్తోందని, చికిత్స కోసం జర్మనీకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోనైనా లేదంటే జూలై మొదటి ప్రాంభంలో జర్మనీకి వెళ్లే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా, భారత జట్టు.. ఇంగ్లండ్ టూర్ టెస్టు మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20, మూడు వన్డేలు ఆడనున్నది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరిస్‌కు రాహుల్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, మ్యాచ్‌కు ఒక రోజు ముందు (ఈ నెల 9న) రాహుల్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు.
ఆ తర్వాత రిషబ్ పంత్‌ను జట్టు కెప్టెన్‌గా బీసీసీ నియమించింది. అయితే, రాహుల్ త్వరగా కోలుకొని వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు ఫిట్నెస్ సాధించాలని భావిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16న ప్రారంభంకానున్నది. పొట్టి క్రికెట్లో రాహుల్ కీలకం కానున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 15 మ్యాచుల్లో 51.33 సగటు, 135 స్ట్రయిక్ రేట్‌తో 6616 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలున్నాయి.