KL Rahul | లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants) జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul ) ఈ ఐపీఎల్ (IPL 2023) మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు (Bangalore) తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మైదానంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. బెంగళూరు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో డుప్లెసిస్ ఎక్స్ట్రా కవర్స్ వైపు కొట్టిన బంతిని ఆపే క్రమంలో రాహుల్ గాయపడ్డాడు. అతడి కుడి తొడ పట్టేయడంతో మైదానంలో కూప్పకూలిన రాహుల్.. ఫిజియో సహాయంతో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు.
అయితే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో జట్టుతోనే ఉన్నాడని బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బుధవారం చెన్నైతో మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం గురువారం అతడు జట్టును వీడనున్నట్లు తెలిపారు. రాహుల్‌కు ముంబయిలో బీసీసీఐ ఆధ్వర్యంలో స్కానింగ్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రాహుల్‌తోపాటు ఇటీవల గాయపడ్డ జయదేవ్ ఉనద్కత్ పరిస్థితిని కూడా బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తర్వాతి ఐపీఎల్ మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండే సూచనలు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలోనే లక్నో టీమ్‌ను కృనాల్ పాండ్యా (Krunal Pandya) నడిపించనున్నట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్ టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో అతడి బాధ్యతను బీసీసీఐ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తీసుకున్నాయి. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. మరోవైపు, జూన్ 7 నుంచి 11 వరకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (World Test Championship final) జరగనున్న నేపథ్యంలో.. అప్పటికి రాహుల్ కోలుకుని అందుబాటులో ఉంటాడో లేదో తెలియాల్సి ఉంది.
Also Read..
Car Hit And Kill | ఢిల్లీలో దారుణం.. బైక్‌ను ఢీ కొట్టిన కారు.. మృతదేహంతో మూడు కిలోమీటర్లు వెళ్లి
Mohammed Shami | షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలున్నాయి.. మరోసారి సంచలన ఆరోపణలు చేసిన హసీన్