‘స్పేర్ టైర్‌ను కూడా ఇంత దారుణంగా వాడి ఉండరు! మీరు అతడిని ఓపెనర్‌గా పంపుతారు. ఐదు, ఆరు స్థానాల్లో ఆడిస్తారు. వికెట్ కీపింగూ చేయిస్తారు. జట్టు కూర్పులో ఎక్కడ సంక్లిష్టత ఉంటుందో అక్కడ అతడిని పంపిస్తారు.కానీ దేనికైనా అతడు అంగీకరిస్తాడు. జట్టు బాగు కోసం దేనికీ అడ్డు చెప్పడు. నిస్వార్థమైన ఆటతీరుకు ఇది నిదర్శనం!’ కేఎల్ రాహుల్ గురించి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ చెప్పిన మాటలు ఇవి. సిద్దూ చెప్పింది అక్షరాలా సత్యం. భారత జట్టులో రాహుల్ నిస్వార్థ సేవకుడు.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ఓపెనింగ్‌కు వెళ్తావా? సరే వెళ్తా! మూడో స్థానంలో బ్యాటర్ల కొరత ఉంది. అక్కడ బ్యాటింగ్ చేస్తావా? మీ ఆజ్ఞ! స్పిన్నర్లను కాచుకుని వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టే మిడిలార్డర్లో ఆడతావా? చిత్తం! లోయరార్డర్లో స్పెషలిస్టు బ్యాటర్ అవసరముంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తావా? జట్టు కోసం దేనికైనా సిద్ధం! వికెట్ కీపింగ్ చేస్తావా? తప్పుకుండా!.. ఇదీ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పరిస్థితి. అవును! అతడు టీమ్ మ్యాన్. జట్టు అవసరాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మన్నా, వికెట్ల వెనుక ఉండాలని ఆదేశించినా దేనికైనా సిద్ధమనే రాహుల్ గత రెండేండ్లుగా భారత్ ఆడే భారీ టోర్నీ విజయాలలో కనిపించని హీరో. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్, ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు కోసం అతడు చేసిన సేవలు వెలకట్టలేనివి.
గత పదేండ్ల కాలంలో టీమ్ మేనేజ్మెంట్ బహుశా రాహుల్‌పై చేసినన్ని ప్రయోగాలు మరే క్రికెటర్ మీద చేయలేదంటే అతిశయెక్తి కాదేమో! 2014లో మొదలైన అతడి ప్రస్థానంలో టెస్టు, వన్డేలు, టీ20లలో రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌ను జట్టు మేనేజ్మెంట్ తమ అవసరాల నిమిత్తం పదేపదే మార్పులు చేస్తూనే ఉంది. వన్డేలలో 2016లో అరంగేట్రం చేసిన రాహుల్.. ఏడాది పాటు ఓపెనర్‌గా ఆడాడు. ఆ తర్వాత అతడిని జట్టు అవసరాల కోసం 2, 3, 4, 6 స్థానాల్లో ఆడించారు. మళ్లీ 2019 నుంచి 2022 దాకా ఒకటి, రెండు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌ను 2023 వన్డే ప్రపంచకప్‌నకు కొద్దిరోజుల ముందు ఐదో స్థానానికి మార్చారు. ఐదో స్థానంలో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫిఫ్త్ పొజిషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్.. 19 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 58.07 సగటుతో 813 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా అతడు 2017-2025 దాకా 31 ఇన్నింగ్స్‌లలో 56.47 సగటుతో 1,299 పరుగులు సాధించాడు.
ఐదో స్థానంలో ఘనమైన రికార్డు కలిగిన రాహుల్‌పై భారత్ మరో ప్రయోగం చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపి రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడించింది. వాస్తవానికి 2024లో శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనే కోచ్ గంభీర్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టినా ఆ తర్వాత టీమ్ఇండియా పెద్దగా వన్డేలు ఆడకపోవడంతో ఇది అంతగా చర్చలోకి రాలేదు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌లో అక్షర్ మెరవడంతో భారత్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ అతడినే ఐదో స్థానంలో కొనసాగించింది. దీంతో రాహుల్.. కిందికి జరగక తప్పలేదు. కానీ ఏ స్థానంలో బరిలోకి దిగినా ‘ఎక్కడ ఆడామన్నది కాదన్నయ్యా. మ్యాచ్‌ను గెలిపించామా లేదా అన్నదే ముఖ్యం’ అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్లు మాయ చేసి ఉండొచ్చు. కోహ్లీ పాకిస్థాన్, ఆస్ట్రేలియాపై మేటి ఇన్నింగ్స్‌లు ఆడి ఉండొచ్చు. ఫైనల్లో రోహిత్ ఆదుకుని ఉండొచ్చు. మిడిలార్డర్లో శ్రేయాస్ మెరుపులు మెరిపించి ఉండొచ్చు. కానీ టోర్నీ ఆసాంతం ఆఖర్లో ఒత్తిడినంతా తాను తీసుకుని మ్యాచ్‌లను ముగించిన బాధ్యత మాత్రం రాహుల్‌దే. ఈ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ బంగ్లాదేశ్ తో 41 నాటౌట్, న్యూజిలాండ్‌తో 23, సెమీస్‌లో ఆస్ట్రేలియాతో 42 నాటౌట్, ఫైనల్లో 34 నాటౌట్‌తో ఫినిషర్ అవతారమెత్తాడు.
ముఖ్యంగా బంతి గింగిరాలు తిరిగిన దుబాయ్ పిచ్‌పై తనదైన ఆటతో వికెట్‌ను కాపాడుకుంటూ జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. రాహుల్ చేసిన 30-40 పరుగుల విలువ కచ్చితంగా సెంచరీలకు మించినదే. అన్నింటికీ మించి అతడు ఆడిన ఇన్నింగ్స్‌లన్నీ ఛేదనలోనే కావడం మరో విశేషం. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరులో రాహుల్ (107 బంతుల్లో 66) ఆటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ రాహుల్ ఆ విమర్శలను సవాల్‌గా తీసుకుని తన ఆటతీరులో మార్పులు చేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అది స్పష్టంగా కనిపించింది. ఒత్తిడిలోనూ భారీ షాట్లు ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో రాహుల్ సఫలీకృతుడయ్యాడు.
ఢిల్లీ: కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ క్రేజీ ఆఫర్ ఇచ్చినా అతడు దానిని తిరస్కరించినట్టు సమాచారం. రాబోయే సీజన్లో ఢిల్లీకి సారథిగా నడిపించాలని యాజమాన్యం కోరినా అందుకు అతడు తిరస్కరించాడని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కెప్టెన్‌గా కంటే ఆటగాడిగా తాను జట్టుకు సేవలందిస్తానని రాహుల్ చెప్పినట్టు వినికిడి. గతంలో అతడు పంజాబ్, లక్నో జట్లకు సారథిగా వ్యవహరించాడు. రాహుల్ సారథ్య బాధ్యతలను వదులుకున్న(?) నేపథ్యంలో అక్షర్ పటేల్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి.
జట్టు కోసం రాహుల్ చాలాకాలంగా ఎన్నో సవాళ్లను స్వీకరిస్తున్నాడు. అతడు ఎంతో ఒత్తిడిని తట్టుకుని మరి వాటికి ఎదురొడ్డి నిలబడ్డ తీరును చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ చేసిన 30-40 పరుగులే మాకు లోయరార్డర్లో చాలా కీలకమయ్యాయి. ముఖ్యంగా ఛేదనలో ఒత్తిడిని చిత్తు చేస్తూ ప్రశాంతంగా అతడు ఆడిన ఆటతో మేం మ్యాచ్‌లను విజయవంతంగా ముగించగలిగాం .
– రోహిత్ శర్మ