KL Rahul | భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న రాహుల్ నిరాశ పరిచాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాత్రం అద్భుతమైన హాఫ్ సెంచరీతో అలరించాడు. కర్ణాటక – హర్యానా మధ్య గ్రూస్-సీ మ్యాచ్ బెంగళూరు వేదికగా బుధవారం మొదలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. అభిమానులు బ్యాట్‌తో అలరిస్తాడని ఆశించగా.. నిరాశపరిచాడు. నెంబర్ త్రీలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ కేవలం 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలోనూ కాస్త ఇబ్బందికరంగానే కనిపించాడు. స్టార్ ప్లేయర్ కర్నాటక తరఫున మార్చి 2020లో బెంగాల్‌తో తన చివరి మ్యాచ్ ఆడగా.. చాలా సంవత్సరాల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతుండగా.. బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తాడని అభిమానులు ఆశించగా.. రాహుల్ బ్యాట్ మాత్రం మూగబోయింది.
ఆస్ట్రేలియా పర్యటనలో రెండు ఇన్నింగ్స్‌లో రాహుల్ రాణించినా.. మిగతా అన్ని ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులు, గబ్బా టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు మాత్రమే చేశాడు. మిగతా ఎనిమిది ఎన్నింగ్స్లో 115 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌తో త్వరలో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడనుండగా.. అప్పటి వరకు రాహుల్ ఫామ్‌లోకి వచ్చి బ్యాట్‌తో రాణించాలని కోరుకుంటున్నారు. ఇక హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆకట్టుకున్నాడు. ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 91 పరుగులు చేశాడు. తొలి రోజు ఆటముగిసే సరికి కర్ణాటక ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. కృష్ణన్ శ్రీజిత్ 18, యశోవర్ధన్ పరంతప్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.