KL Rahul – Athiya : టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అథియా శెట్టి పండంటి ఆడబిడ్డకు సోమవారం జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అథియా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఆ దేవుడి అనుగ్రహంతో మాకు అమ్మాయి పుట్టింది’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిందీ బాలీవుడ్ నటి. దాంతో, భారత క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు రాహుల్, అథియా దంపతులకు అభినందనలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లలో టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, హీరో జాకీ ష్రాఫ్‌లు ఉన్నారు.
కొన్నాళ్లు డేటింగ్లో మునిగి తేలిన రాహుల్, అథియాలు 2023 జనవరి 23న పెళ్లి చేసుకున్నారు. ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాలలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రాహుల్, అథియా వివాహం జరిగింది. వీళ్లిద్దరూ 2019 నుంచి డేటింగ్లో ఉన్నారు. అయితే.. రాహుల్- అథియా తమ రిలేషన్షిప్ విషయం ఎక్కడ బయటపడకుండా చూసుకున్నారు. 2021లో రాహుల్, అథియా పుట్టిన రోజున ఇన్‌స్టాలో ఆమెను విష్ చేస్తూ ఫొటో షేర్ చేశాడు.
దాంతో, వాళ్లు ప్రేమలో ఉన్నామనే విషయం అందరికి తెలిసింది. ఆ తర్వాత రాహుల్, అథియా జంటగా పార్టీల్లో కనిపించారు. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.ఖండాలలోని సునీల్ శెట్టి నివాసంలో కుటుంబ సమక్షంలో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ మధ్యే బేబీ బంప్ ఫొటోషూట్ ఫొటోల్ని పంచుకున్న అథియా మాకు ఆడపిల్ల జన్మించింది అని అందరికీ తీపి కబురు చెప్పింది.
ఐపీఎల్ 16వ సీజన్లో మోకాలి నొప్పి కారణంగా టోర్నీకి దూరమైన రాహుల్ సర్జరీ అనంతరం జట్టులోకి వచ్చాడు. ఈమధ్యే చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడీ బ్యాటర్. జట్టు అవసరాన్ని బట్టి ఓపెనర్‌గా, మిడిలార్డర్లో.. 7వ స్థానంలోనూ ఆడేందుకు నేను సిద్ధమే అంటాడు రాహుల్. అందుకే.. అతడిని స్పేర్ టైర్ కంటే ఎక్కువగా వాడేశారని భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.