KP Vivekananda | కేంద్రమంత్రి బండి సంజయ్ మా పార్టీ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆధారాలు లేకుండా తీవ్ర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి మాట్లాడారు. బాధ్యతగల పదవిలో ఉండి కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలను పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
బీజేపీ అధ్యక్ష పదవి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ పదవి దక్కించుకోవడం కోసమే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని కేపీ వివేకానంద ఆరోపించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం ఆ పదవిని కించపరిచేలా ఉందని అన్నారు. బండి సంజయ్ మానసిక పరిస్థితి సరిగా లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే హైదరాబాద్‌కు ఒక నేషనల్ పార్క్ తీసుకురావాలని.. తెలంగాణకు నిధులు తీసుకురావాలని సూచించారు. ఆ దమ్ము, ఆ ధైర్యం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రెచ్చగొట్టే మాటలతో రాజకీయాలు చేయాలని బండి సంజయ్ చూస్తున్నారని కేపీ వివేకానంద మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి నాయకులను ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. కరీంనగర్‌కు గాని రాష్ట్రానికి గాని రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించాలి.. తప్ప ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో మీ పదవిని కించపరచకండని హితవుపలికారు. చిల్లర వ్యాఖ్యలతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని బండి సంజయ్‌కు సూచించారు.