కౌలాలంపూర్: భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సత్తాచాటాడు. గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు నిలకడలేమితో సతమతమవుతున్న శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఆరేండ్ల వ్యవధిలో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో శ్రీకాంత్ తుదిపోరులో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-18, 24-22తో యుషి తనాకా(జపాన్)పై అద్భు త విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన పోరులో తన అనుభవాన్ని ఉపయోగించుకున్న శ్రీకాంత్..ప్రపంచ 23వ ర్యాం కర్ యుషిని వరుస గేముల్లో చిత్తుచేశాడు.
2019 ఇండియా ఓపెన్‌లో రన్నరప్ తర్వాత శ్రీకాంత్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ 65వ ర్యాంక్ ప్లేయర్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్న ఈ మాజీ వరల్డ్నంబర్కు మలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ధీటైన పోటీ ఎదురైంది. పాయింట్, పాయింట్‌కు నువ్వానేనా అన్నట్లు పోరాటం కొనసాగింది.చివరి దశలో తనా కా తప్పు చేయడం శ్రీకాంత్‌కు కలిసొచ్చింది.