బెకెన్హామ్: ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. ముగిసిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన రెండు టెస్టుల్లో ఎలాగైనా గెలిచి సిరీస్ దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమ్ఇండియా ఉన్నది. ఈనెల 23 నుంచి ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా మొదలయ్యే నాలుగో టెస్టు కోసం ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. మాంచెస్టర్‌లో మొదలయ్యే నాల్గో టెస్టులో తుది కూర్పుపై విశ్లేషణలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎనిమిదేండ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ కరణ్నాయర్పై అందరి దృష్టి నెలకొన్నది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాణిస్తాడనుకున్న నాయర్ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో నాయర్‌ను తప్పిస్తూ యువ క్రికెటర్ సాయి సుదర్శన్‌ను తీసుకోవాలన్న డిమాండ్ అందరి నుంచీ వినిపిస్తున్నది. దీనికి మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు కూడా మరింత బలం చేకూరుస్తున్నాయి. నాయర్ స్థానంలో సుదర్శన్ మినహా నాల్గో టెస్టుకు పెద్దగా మార్పులేమి ఆశించడం లేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడేది దాదాపు ఖరారు కాగా నితీశ్‌కుమార్, వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడేండ్ల క్రితం డిసెంబర్ 2022లో కరణ్ చేసిన ‘డియర్ క్రికెట్.. గివ్ మీ వన్ మోర్ చాన్స్’ అంటూ సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకుముందు ఆరేండ్ల కింద డిసెంబర్ 2016లో ఇదే ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ(303)తో కరణ్ నాయర్ కొత్త చరిత్ర లిఖించాడు. ఇంగ్లిష్ బౌలర్లను చీల్చిచెండాడుతూ పరుగుల వరద పారించాడు. గాయపడ్డ రహానే స్థానంలో జట్టులో చోటు దక్కించుకుని ట్రిపుల్ సెంచరీతో సత్తాచాటిన కరణ్‌ను దురదృష్టం నీడలా వెంటాడింది. ఎంతలా అంటే వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచినా.. మళ్లీ జాతీయ జట్టులోకి రావడానికి ఎనిమిదేండ్లు పట్టింది. దీని వెనుక అతని కఠోర శ్రమ దాగుంది. దేశవాళీ టోర్నీల్లో విదర్భ తరఫున టన్నుల కొద్ది పరుగులు సాధించిన ఈ 33 ఏండ్ల క్రికెటర్‌కు రీఎంట్రీ అసలు కలిసి రావడం లేదు. డియర్ క్రికెట్ గివ్ మీ చాన్స్ అన్న కరణ్‌కు అసలు ఈ క్రికెటర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారన్న అపవాదును అతి త్వరలోనే మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు టెస్టుల్లో నాయర్ 21.83 సగటుతో 131 పరుగులకే పరిమితమయ్యాడు.
ఇందులో వరుసగా 0, 20, 31, 26, 40, 14 పరుగులతో ఘోరంగా నిరాశపరిచాడు. ఎనిమిదేండ్ల తర్వాత వచ్చిన తొలి పోరులోనే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నాయర్..బ్రెండన్ కార్స్ వేసిన ఇన్‌స్వింగ్ డెలివరీకి బలయ్యాడు. బంతిని సరిగ్గా అంచనా వేయని నాయర్ అప్పనంగా వికెట్ ఇచ్చుకున్నాడు. తద్వారా టీమ్ఇండియా వికెట్ల పతనానికి గేట్లు తెరుచుకున్నాయని ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవైపు టాపార్డర్‌లో జైస్వాల్, రాహుల్, కెప్టెన్ గిల్, రిషబ్ పంత్ పోటీపడీ సెంచరీలు చేస్తుంటే.. నాయర్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. నాయర్‌కు బదులుగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మరో అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్లు దీప్‌దాస్‌గుప్తా, సంజయ్ మంజ్రేకర్ ఘంటాపథంగా చెబుతుంటే అనిల్ కుంబ్లే మాత్రం అతనికి మరో అవకాశమివ్వాలని మద్దతుగా నిలిచాడు. మొత్తంగా నాల్గో టెస్టులో నాయర్‌పై వేటు దాదాపు ఖాయం కాగా, సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్‌లో ఎవరికి బెర్తు దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.