ఆమె సంకల్పం ముందు వైకల్యం మరోసారి ఓడిపోయింది. ఆ యువతి పట్టుదలకు పతకాలు దాసోహం అంటున్నాయి. ప్రతి మలుపులో గెలుపు సాధిస్తున్న తెలంగాణ పరుగుల రాణి జివాంజీ దీప్తి మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వెండి వెలుగులు విరజిమ్మింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన టోర్నీలో మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్ రేసులో దీప్తి రజత పతకం సాధించింది. ఈ భారత యువ అథ్లెట్ సీజన్ బెస్ట్ నమోదు చేస్తూ55.16 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నది. గత చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన దీప్తి.. ఈసారి సిల్వర్ మెడల్ కొల్లగొట్టింది.
దీప్తి జివాంజీ పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితం. పతకాల వేటలో అలుపెరగకుండా పరుగులు తీస్తూ… తనను తాను నిరూపించుకుంటున్నది. హేళనలు ఎదుర్కొన్న చోట.. మెచ్చుకోళ్లు సాధిస్తున్నది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ దీప్తి స్వగ్రామం. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పేదరికానికి తోడు పుట్టుకతో వచ్చిన వైకల్యం దీప్తి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. కానీ, ఈ అడ్డంకులు ఆమె పరుగును ఆపలేకపోయాయి. పరుగును జీవితంలో భాగం చేసుకున్నదామె. చిన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా మెరుపు వేగంతో పరుగు తీసేది దీప్తి. వయసు పెరుగుతున్నా.. పరుగు ఆపలేదు. బడికి వెళ్లినా, గుడికి బయల్దేరినా.. చిరుతలా దూసుకుపోయేది!
చూసేవాళ్లు ఏమనుకున్నా.. ఆమె పరుగు ఆపేది లేదు. దీప్తి ప్రతిభను గుర్తించిన ఆర్డీఎఫ్ పాఠశాల యాజమాన్యం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఉన్నంతలో మంచి శిక్షణ ఇప్పించింది. పాఠశాల నిర్వాహకుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావు సహకారంతో పోటీల్లో పాల్గొంటూ ఉండేది దీప్తి. జిల్లా స్థాయిలో ఆమె ప్రదర్శన అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో దీప్తి పరుగు మరింత వేగం పుంజుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ఈ పరుగుల రాణి చెమటోడ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి దాటుకొని అంతర్జాతీయ వేదికలపైనా విజయ దుందుభి మోగిస్తున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది.
దీప్తి తన ప్రత్యేక ప్రతిభతో స్కూల్ లెవల్లోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణకు ఎంపికైంది. శిక్షణ తీసుకుంటూ అక్కడే చదువును కొనసాగించింది. తర్వాత తొర్రూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతూ సాధన కొనసాగించింది. 2016లో కరీంనగర్లో జరిగిన జూనియర్ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2017లో కేరళలో జరిగిన సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకున్నది. ఇలా దీప్తి బరిలోకి దిగితే పతకం ఖాయం అన్న పేరును సాధించింది. అంతర్జాతీయ ఈవెంట్లోనూ అదే రికార్డ్ కొనసాగిస్తున్నది. 2019లో హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఏషియన్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పోటీలో కాంస్య పతకం సాధించింది.
మిడ్లే రిలే పోటీలలో రజతం, మొరాకోలో జరిగిన నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ గెలుచుకున్నది. 2022లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ 400 మీటర్ల పోటీలో గోల్డ్ మెడల్ సాధించింది. అదే ఏడాది ఆస్ట్రేలియాలో ఏషియా గేమ్స్‌లో 200 మీటర్లలో, 400 మీటర్లలో అగ్రస్థానంలో నిలిచింది. 2023లో చైనాలో జరిగిన ఏషియన్ పారా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ (400 మీటర్ల పోటీ) సాధించింది. ఈ పోటీలో దీప్తి 55.12 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి అప్పటి వరకు అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ రికార్డును బద్దలు కొట్టింది.
2024 మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పోటీలలో బంగారు పతకం, అదే ఏడాది ప్రపంచ పారా ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది. తన ప్రతిభతో లెక్కలేనన్ని పతకాలు సాధించిన దీప్తిని కేంద్ర ప్రభుత్వం 2024లో అర్జున అవార్డుతో సత్కరించింది. తాజాగా మరో విజయాన్ని సాధించి.. తన పరుగు ఆగదు అని చెబుతున్న దీప్తికి మనమూ అభినందనలు చెబుదాం!
– పిన్నింటి గోపాల్, హనుమకొండ