దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు మంగళవారం ఐసీసీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఐసీసీ చైర్మెన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఆయన స్థానాన్ని షా భర్తీ చేయనున్నాడు.
తద్వారా 35 ఏండ్ల వయసులోనే ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. డిసెంబర్ 1 నుంచి జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఐదో వ్యక్తి షా. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పనిచేశారు. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవడం తనకు దక్కిన గొప్ప గౌరవమని షా తెలిపాడు.
ఐసీసీలో 17 ఓట్లు (12 టెస్టు ఆడే సభ్య దేశాలు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఇద్దరు అసోసియేట్ మెంబర్ నామినీలు, ఒక మహిళా డైరెక్టర్) ఉండగా జై షా ఎన్నికకు 15 మంది మద్దతు తెలపడంతో అతడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐసీసీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన జై షా కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు శుభాకాంక్షలు తెలిపారు.