ముంబై: ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు ఎంపికపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఆసియా కప్ కోసం మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. అయితే గాయాలతో సహవాసం చేస్తున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆసియా కప్ టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని మరింత బలపరుస్తూ టోర్నీకి అందుబాటులో ఉండబోతున్నట్లు సెలెక్టర్లకు సమాచారమిచ్చినట్టు జాతీయ వార్తా సంస్థలు తమ కథనాల్లో ప్రముఖంగా పేర్కొన్నాయి. దీంతో వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత బుమ్రా మళ్లీ టీమ్ఇండియా తరఫున టీ20లు ఆడనున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో ముందుగా అనుకున్నట్లుగానే ఐదు మ్యాచ్‌ల్లో మూడింటికే పరిమితమైన బుమ్రా.. ఆసియా కప్‌లో బరిలోకి దిగితే భారత్ పేస్ దళం మరింత పదునెక్కే అవకాశముంది.
ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లేని లోటును బుమ్రాతో పూడ్చేందుకు సెలెక్టర్లకు ఇది మంచి అవకాశం. దీనికి తోడు కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేయడంలో ముందుండే బుమ్రా జట్టులో ఉండటం అదనపు బలం కానుంది. భవిష్యత్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని బుమ్రాను సెలెక్టివ్‌గా ఆడిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. టీ20ల్లో ప్రస్తుతం అర్ష్‌దీప్‌సింగ్ ప్రధాన బౌలర్‌గా కొనసాగుతుండగా, హర్షిత్ రానా కీలకంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవలి ఐపీఎల్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ బెర్తులు దక్కించుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. మొత్తంగా స్లో పిచ్‌లకు చిరునామా అయిన యూఏఈలో బౌలింగ్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొన్నది.
ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన శ్రేయాస్ అయ్యర్, జితేశ్శర్మ తిరిగి టీమ్ఇండియా టీ20 జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో పంజాబ్ జట్టును అయ్యర్ ముందుండి నడిపిస్తే లోయార్డర్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 18 ఏండ్లలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలువడంలో జితేశ్ కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ వీళ్ల ఇద్దరిని టీమ్‌కు ఎంపిక చేస్తే అదే సమయంలో ఆల్‌రౌండర్ శివమ్‌దూబే, హార్డ్‌హిట్టర్ రింకూసింగ్‌ను పక్కకు తప్పించాల్సి ఉంటుంది.
స్పిన్ బౌలింగ్‌లో ధాటిగా ఆడటంలో దిట్ట అయిన శివమ్ దూబేతో శ్రేయాస్‌కు పోటీ నెలకొన్నది. తనదైన రోజున ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో దూకుడుగా ఆడటంలో శ్రేయాస్ ముందంజలో ఉంటాడు. మరోవైపు సంజూ శాంసన్‌కు రిజర్వ్ వికెట్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న ధృవ్జురెల్ను తప్పించి అతని స్థానంలో జితేశ్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన లోయార్డర్‌లో ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి దూకుడుగా ఆడటంలో జురెల్ కంటే జితేశ్ ఒకింత ముందున్నాడు.
శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ టీ20 టీమ్‌లోకి రావడంపై సందిగ్ధత నెలకొన్నది. ఈ మధ్యే ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించిన గిల్, జైస్వాల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవేళ ఆసియా కప్ టీమ్‌కు గిల్, జైస్వాల్‌ను పరిగణనలోకి తీసుకుంటే కొద్ది రోజుల తేడాతో స్వదేశం వేదికగా వెస్టిండీస్‌తో మొదలయ్యే టెస్టు సిరీస్‌కు ఎక్కువ సమయం దొరకకపోవచ్చు. సెప్టెంబర్ 28తో ఆసియా కప్ ముగుస్తుండగా, అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో విండీస్‌తో తొలి టెస్టు మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో రానున్న సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని టెస్టు టీమ్‌లో కీలకమైన గిల్, జైస్వాల్‌ను ఆసియా కప్‌నకు ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. మొత్తంగా మంగళవారం జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశం ద్వారా వీటన్నింటికి సమాధానం దొరకనుంది. చీఫ్ కోచ్‌గా గౌతం గంభీర్ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన 15 టీ20ల్లో టీమ్ఇండియా 13 విజయాలు సొంతం చేసుకుంది. దీనికి తోడు వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్న క్రమంలో ప్రస్తుత కోర్‌టీమ్‌లో భారీ మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.