James Anderson : ప్రపంచ క్రికెట్లో వయసు పెరిగినా కొద్దీ రాటుదేలిన పేసర్ ఎవరంటే.. ఠక్కున గుర్తుకొచ్చే పేరు జేమ్స్ అండర్సన్ (James Anderson). ‘స్వింగ్ కింగ్’గా పేరొందిన అండర్సన్ దిగ్గజ పేసర్‌గా ఎదిగాడు. ఇంగ్లండ్ జట్టుకు సుదీర్ఘ కాలం ఆడిన ఈ వెటరన్ పేసర్ ఈ ఏడాదే అంతర్జాతీయ కెరీర్ ముగించాడు. 42 ఏండ్ల వయసులో ఆటకు అల్విదా పలికిన జిమ్మీ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మెగా వేలంలో పేరు నమోదు చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. రిటైర్మెంట్ అనంతరం కూడా క్రికెట్ ఆడాలనే తపనతోనే వేలానికి వస్తున్నట్టు అండర్సన్ చెబుతున్నాడు.
ఐపీఎల్ వేలంలో పేరు రిజిష్టర్ చేసుకున్న అండర్సన్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇంకెంతకాలం క్రికెట్ ఆడుతారు? అనే ప్రశ్నకు ఈ దిగ్గజ పేసర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. నేను మళ్లీ క్రికెట్ ఆడాలనుకున్నా. అందుకే వేలంలోకి వస్తున్నా. అయితే.. నన్ను ఏ జట్టు అయినా కొంటుందా? లేదా? అనేది తర్వాత విషయం. కానీ, నేను ఫామ్‌లోనే ఉన్నానని నా మనసు చెబుతోంది. నేను ఫిట్‌గానే ఉన్నాను.
“I’ve got more to offer!” 💪
Could Jimmy Anderson appear in the upcoming IPL season? 🤔 pic.twitter.com/ToOPT12s6L
— Sky Sports Cricket (@SkyCricket) November 8, 2024
వీలైనన్ని రోజులు క్రికెట్ ఆడుతాను. ఒకవేళ నేను అనుకున్నట్టే ఈ ప్రయాణం సాగితే 50 ఏండ్లు వచ్చే వరకూ ఆడుతా. ఎందుకంటే నేను ఇప్పటికీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నాను. అయితే.. ఇంగ్లండ్ యువఆటగాళ్లపై దృష్టి పెడుతోంది. ఇది చాలా మంచి విషయం అని అండర్సన్ తెలిపాడు. ఐపీఎల్ 18 సీజన్ వేలంలో అండర్సన్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. రూ.1.25 కోట్ల కనీస ధరకు పేరు నమోదు చేసుకున్న ఈ వెటరన్ పేసర్‌ను ఎవరు కొంటారో చూడాలి.
అంతర్జాతీయ క్రికెట్లో అండర్సన్‌ది 22 ఏండ్ల జర్నీ.. అంత ఈజీ కాదు. అలాంటిది ఓ పేసర్ గాయాలను తట్టుకొని, ఫిట్నెస్ కాపాడుకొని 401మ్యాచ్‌లు ఆడేశాడంటే అది నిజంగా అద్భుతమే. అందుకనే 41 ఏండ్ల వయసులోనూ అండర్సన్ బౌలింగ్ చేస్తుంటే.. ‘వయసు మర్చిపోయాడా ఏంటీ?’ అని అతడితో కెరీర్ మొదలెట్టిన వాళ్లు అసూయ పడేవారు. చెప్పాలంటే.. అండర్సన్ తన తరం, తర్వాతి తరం కుర్రాళ్లతోనూ కలిసి ఆడాడు.
సుదీర్ఘ కెరీర్లో మూడు ఫార్మాట్లలో 401 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 991 వికెట్లు పడగొట్టాడు. అయితే వీటిలో అత్యధికం టెస్టుల్లో వచ్చినవే. రెడ్ బాల్ క్రికెట్లో 704, వన్డేల్లో 269, టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. లార్డ్స్ టెస్టు అనంతరం ఇక సెలవంటూ ఆట నుంచి వైదొలిగిన జిమ్మీ కొత్త అవతారం ఎత్తాడు. ఇంగ్లండ్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు.