Neeraj Chopra : భారత దేశపు అథ్లెట్లలో నీరజ్ చోప్రా (Neeraj Chopra)ది ప్రత్యేక స్థానం. వరుసగా రెండు విశ్వక్రీడల్లో పసిడి, రజతం సాధించిన జావెలిన్ త్రోయర్‌గా నీరజ్ చరిత్రకెక్కాడు. తాజాగా కోచ్ క్లాస్ బార్టోనియెట్జ్(Klaus Bartonietz)కు భావోద్వేగ వీడ్కోలు పలికిన ఈ బడిసె వీరుడు తన కెరీర్ చాయిస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అథ్లెట్ కాకపోయి ఉంటే కచ్చితంగా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయ్యేవాడిని’అని నీరజ్ వెల్లడించాడు. అతడి సమాధానం విన్న అక్కడివాళ్లంతా అవునా అంటూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకూ తన ఫొటోగ్రఫీ అభిరుచి గురించి బల్లెం వీరుడు ఇంకా ఏం చెప్పాడో తెలుసా…?
‘నాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకని ప్రొఫెషనల్ కెమెరామెన్ అవ్వాలనుకున్నా. ఆలోచన రావడమే ఆలస్యం ఖరీదైన కెమెరా కొన్నాను. లెన్స్‌లు కూడా మంచివే తీసుకున్నా. కానీ, జావెలిన్ త్రో వైపు మళ్లాను. ఒకవేళ అథ్లెట్ కాకపోయి ఉంటే ఫొటోగ్రాఫర్ అయ్యేవాడిని. అయితే.. నేను ఇప్పటివరకూ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీలో మాత్రం శిక్షణ తీసుకోలేదు. ఫొటోగ్రఫీ అనేది నా హాబీ’ అని నీరజ్ వెల్లడించాడు.
అంతేకాదు తనకు ఇంటి భోజనం అంటే ఎంతో ఇష్టమని కూడా తెలిపాడు. నాకు ఇంటి భోజనం అంటేనే ఇష్టం. అయితే.. టోర్నీల కారణంగా నేను ఎంతో ఇష్టపడే పప్పు, అన్నం భోజనాన్ని దూరమయ్యాను. వెన్నతో కూడిన పులావు ఉన్నా సరే లాగించేస్తా అని నీరజ్ చోప్రా వివరించాడు.
హర్యానాలోని పానిపట్ జిల్లా ఖాంద్ర నీరజ్ స్వగ్రామం. చిన్నప్పుడు మనోడు బాగా లావుగా ఉండేవాడు. అందుకని అతడిని ఏవైనా ఆటలు ఆడమని ఇంట్లోవాళ్లు తరచూ సతాయించేవాళ్లు. అయితే.. నీరజ్ మాత్రం అందరికీ భిన్నంగా రెజ్లింగ్, ఇతర క్రీడలు కాకుండా జావెలిన్ అందుకున్నాడు. కోచ్ జైవీర్ సలహాలతో జావెలిన్ త్రోలో రాణించాడు. 2011లో అతడు పటియాలాలోని తౌ దేవీ లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కోచ్ నసీం అహ్మద్ దగ్గర శిక్షణ పొందాడు.
భారత దేశంలో జావెలిన్ త్రోకు పిచ్చి క్రేజ్ తెచ్చిన నీరజ్.. డైమండ్ లీగ్, ఒలింపిక్స్ పోటీల్లో చరిత్ర సృష్టించాడు. టోక్యో విశ్వ క్రీడల్లో దేశానికి స్వర్ణం అందించిన అతడు.. పారిస్‌లో వెండితో మెరిశాడు. అయితే.. 90 మీటర్ల మార్క్ అందుకోలేకపోయిన ఈ బడిసె యోధుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన విజయాల్లో కీలక పాత్ర పోషించిన జర్మనీ కోచ్ క్లాస్ బార్టోనియెట్జ్కు నీరజ్ ఈమధ్యే వీడ్కోలు పలికాడు. అతడి స్థానంలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ జెలెంజీని కోచ్‌గా నియమించుకున్నాడు.