Forex Reserves | వరుసగా ఐదో వారం భారత్ ఫారెక్స్ రిజర్వు (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.7 బిలియన్ డాలర్లు తగ్గి 682.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.84.38లకు పడిపోయింది. ఫలితంగా రూపాయి మరింత బలహీన పడకుండా ఆర్బీఐ అడ్డుకున్నది. అంతకుముందు అక్టోబర్ 25తో ముగిసిన వారానికి కూడా ఫారెక్స్ నిల్వలు 3.4 బిలియన్ డాలర్లు పతనమై 634.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏఎస్) 3.9 బిలియన్ డాలర్లు క్షీణించి 589.84 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గోల్డ్ రిజర్వ్ నిల్వలు 1.2 బిలియన్ డాలర్లు పెరిగి 69.75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మరో పది లక్షల డాలర్లు తగ్గి 18.21 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు నాలుగు మిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే శరవగేంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది.