రాయపోల్, ఫిబ్రవరి 17 : రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తోగుట సీఐ లతీఫ్, ఎస్సై మానస గ్రామస్థులకు కీలక సూచనలు చేశారు. సీఐ లతీఫ్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మరియు సామాజిక రుగ్మతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదని, ఫోన్కు వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సీఐ సూచించారు. గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లతీఫ్ తెలిపారు. ఎస్.ఐ. మానస మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గ్రామస్థులకు వివరించారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా సీఐ, ఎస్సైలు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్తు అశోక్ రెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.