Yashasvi Jaiswal : అంతర్జాతీయ క్రికెట్లో సంచలనంగా మారిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. చిన్నవయసులోనూ ‘థౌంజడ్వాలా’గా రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు టెస్టుల్లో సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి భారత దిగ్గజ క్రికెటర్లకు సైతం సాధ్యంకాని రికార్డు సృష్టించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అలరించే ఈ యంగ్‌స్టర్ తొలి 10 మ్యాచుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.
తద్వారా 147 ఏండ్ల సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఈ ఘనతకు చేరువైన భారత ఆటగాడిగా నిలిచాడు. చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 56, రెండో ఇన్నింగ్స్‌లో 10 రన్స్ చేసిన యశస్వీ ప్రస్తుతం ఖాతాలో 1,094 పరుగులు ఉన్నాయి. లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) 978 పరుగులతో రెండో స్థానంలో, వినోద్ కాంబ్లీ 937 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ సిరీస్(England Sereis)లో దంచికొట్టిన యశస్వీ టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధర్మశాల టెస్టులో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది యశస్వీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ చిచ్చరపిడుగు 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి రన్స్ కొట్టాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు కొట్టిన ఛతేశ్వర్ పూజారా మూడో స్థానానికి పడిపోయాడు. అంతేకాదు బ్యాటింగ్ యావరేజ్లోనూ యశస్వీ రికార్డులు బ్రేక్ చేశాడు.
వినోద్ కాంబ్లీ 83.33 సగటుతో టాప్‌లో నిలవగా.. యశస్వీ 71.43 సగటుతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 7 మ్యాచుల్లోనే ఈ మైలురాయికు చేరుకోగా.. యశస్వీ 9 వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఎవర్టన్ వీకెస్, హెర్బెర్ట్ సట్క్లిఫె, జార్జ్ హెడ్లేలు 9 మ్యాచుల్లో వెయ్యి రన్స్ కొట్టారు.
అత్యంత చిన్నవయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ కొట్టిన యశస్వీ.. మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 19 ఏండ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. యశస్వీ 22 ఏండ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ 21 ఏండ్ల 27 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు.