IPL 2025 : ఐపీఎల్లో అత్యుత్తమ ఆటతోనే కాదు కెప్టెన్సీతోనూ రికార్డు బద్దలు కొడుతున్నాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer). నిరుడు కోల్‌కతా రైడర్స్(KKR)ను ఛాంపియన్‌గా నిలిపిన అయ్యర్.. ఈసారి పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను టైటిల్‌కు మరింత చేరువ చేశాడు. అతడి సారథ్యంలో అదరగొడుతున్న పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. దాంతో, ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లను ప్లే ఆఫ్స్ తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా శ్రేయాస్ రికార్డు సృష్టించాడు. సారథిగా అతడు నాలుగు సీజన్లలో ప్లే ఆఫ్స్ ఆడనున్న సారథి కూడా అతడే కావడం విశేషం.
పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తున్న అయ్యర్.. ఐపీఎల్ కెప్టెన్‌గానూ విజయవంతం అయ్యాడు. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) సారథిగా వ్యవహరించిన అతడు జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత సీజన్లోనూ తన నాయకత్వ పటిమతో ఆకట్టుకున్న అయ్యర్ ఢిల్లీని ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు. 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ పగ్గాలు అందుకున్న అయ్యర్.. తన మార్క్ కెప్టెన్సీతో జట్టును గెలుపు తోవలో నడిపాడు. లీగ్ దశలో అన్ని జట్లకు షాకిస్తూ కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
Different jerseys, same leadership DNA 🧬🫡
Will this be the season Shreyas Iyer takes PBKS all the way? 🤔#TATAIPL | @PunjabKingsIPL | @ShreyasIyer15 pic.twitter.com/poIirhscGM
— IndianPremierLeague (@IPL) May 19, 2025
నాకౌట్ పోరులోనూ అదే జోరు చూపించిన అయ్యర్ బృందం మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే.. కోల్‌కతా టైటిల్ క్రిడిట్ అంతా మెంటార్ గౌతం గంభీర్(Gautam Gambhir)కు వెళ్లడంతో చిన్నబుచ్చుకున్న అయ్యర్.. జట్టుతో కొనసాగేందుకు అభ్యంతరం తెలిపి మెగా వేలానికి వచ్చాడు. యూఏఈలో జరిగిన ఆక్షన్‌లో ఈ యంగ్‌స్టర్ అందరూ ఊహించినట్టే రికార్డు ధర పలికాడు. నాయకుడిగా అతడి అనుభవం తమ జట్టుకు పనికొస్తుందనుకున్న పంజాబ్ రూ.26.75 కోట్లు చెల్లించి మరీ అయ్యర్‌ను దక్కించుకుంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్ ఆడింది. అయితే.. భారీ ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి ఛాంపియన్ అయింది. అప్పట్నుంచీ లీగ్ దశలోనే వెనుదిరుగుతున్న పంజాబ్ రాత మార్చేందుకు సిద్ధమయ్యారు అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting). ఈ ఇద్దరి ఆధ్వర్యంలో పంజాబ్ సమిష్టిగా రాణిస్తూ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
అయ్యర్ సైతం కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తూ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.12 మ్యాచుల్లో 174.69 స్ట్రయిక్ రేటుతో 435 రన్స్ కొట్టాడు. మే 18న రాజస్థాన్ రాయల్స్‌పై 10 పరుగుల విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. అయితే.. ఆదివారం డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు గిల్ బృంద, అయ్యర్ సేనతో పాటు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. లీగ్ దశ చివరి రెండు మ్యాచుల్లో పంజాబ్ మే 24న ఢిల్లీతో, మే 26న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.