Ishan Kishan : భారత ఆశాకిరణంగా పేరొందిన ఇషాన్ కిషన్(Ishan Kishan) బ్లూ జెర్సీ వేసుకొని ఆరు నెలలు దాటింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశం వచ్చేయడం.. ఆపై ‘సెంట్రల్ కాంట్రాక్ట్’ కోల్పోవడం.. ఇవన్నీ కిషన్ కెరీర్‌ను ఓ దశలో ప్రమాదంలో పడేశాయి. ఆ సమయంలో.. ఈ యంగ్‌స్టర్ అసలు ఎందుకలా చేశాడు? అని దేశమంతా మాట్లాడుకుంది. కానీ, ఇషాన్ మాట్లాడితే ఒట్టు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో తిరిగి వచ్చాక ఇషాన్ తొలిసారి నోరు విప్పాడు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఇంటర్వ్యూలో ఈ వికెట్ కీపర్ సంచలన విషయాలు వెల్లడించాడు.
‘నాకు ప్రయాణ అలసట అనే సమస్య ఉంది. దాంతో, నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను. ఈ క్రమంలోనే కొన్ని రోజులు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఆ సమయంలో ఇక లాభం లేదనుకొని కొన్ని రోజులు క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చాను. అయితే.. దురృష్టవశాత్తూ నా పరిస్థితిని మా ఇంట్లోవాళ్లు, కొందరు స్నేహితులు మినహా ఎవరూ అర్థం చేసుకోలేదు అని వెల్లడించాడు.
అంతేకాదు ఇప్పుడు తన ఆరోగ్యం, ఆలోచనా తీరు చాలా బాగుందని ఇషాన్ చెప్పాడు. ‘ఇప్పుడు మానసికంగా చాలా బాగున్నా. భవిష్యత్ గురించి ఆందోళన చెందడం లేదు. వర్తమానంలో ఉంటన్నా. ఇప్పుడు నా దృష్టంతా ఉత్తమ ఆటగాడిగా ఎదగడం మీదే. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి.. మూడు ఫార్మాట్లలో ఆడతాననే నమ్మకం నాకుంది’ అని ఇషాన్ వివరించాడు.
బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో ఇషాన్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. వన్డేల్లో, టీ20ల్లో ఓపెనర్‌గా అతడి ప్లేస్ ఖాయం అనుకున్నారంతా. కానీ, దక్షిణాఫ్రికా సిరీస్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ(Jitesh Sharma)ను ఎంపిక చేయడంలేదని, అందుకనే ఇషాన్ అర్ధాంతరంగా స్వదేశం వచ్చాడనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు యోగా ముద్రలో ఉన్న ఫొటోలతో కనిపించాడు. దాంతో, రంజీల్లో ఆడాల్సిందిగా ఇషాన్‌ను బీసీసీఐ ఆదేశించింది. అయినా మనోడు లెక్కచేయలేదు. చివరకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేశాక.. కిరణ్ మోరె అకాడమీతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కంటపడ్డాడు.