అమరావతి : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (CMs Meeting) సమావేశంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdan Reddy ) తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు చర్చల సారాంశం ఏపీ ప్రజలకు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరస్పర పొగడ్తలు తప్ప చర్చలతో సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
వీరి చర్చలకు దశ, దిశ లేకుండా సాగిందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు జరగలేదని, కాలయాపన కోసమే కమిటీలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ఏపీ ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిళ్లే విధంగా జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు.
తిరుమల , తిరుపతి దేవస్థానంలో వాటాతో పాటు, పోలవరం ముంపు మండలాల విలీనం గురించి తెలంగాణ ప్రతిపాదనలపై ఏపీ ఎలాంటి వైఖరి అవలంభించిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 9,10 షెడ్యూల్ కింద రావాల్సిన ఆస్తులు ఎన్నో ఉన్నాయని, వీటిపై ఎందుకు చంద్రబాబు స్పందించ లేదని కాకాణి ప్రశ్నించారు.