IPL 2025 : గత రెండు మూడు నెలలుగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై ఎటూ తేల్చని బీసీసీఐ(BCCI) ఉత్కంఠకు తెరదించనుంది. ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) నేపథ్యంలో ఎంత మందిని అట్టిపెట్టుకోవచ్చు? అనే విషయమై మరికొన్ని గంటల్లోనే ప్రకటన చేయనుంది. శనివారం ఐపీఎల్ కార్యనిర్వాహక మండలి రిటెన్షన్ రూల్(Retension Rule)పై చర్చించనుంది. అందుకోసం బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్లో సమావేశం అవుతోంది. ఈ మీటింగ్ అనంతరం ఎంతమందిని అట్టిపెట్టుకోవాలి? అనేది స్పష్టం చేయనుంది. దాంతో, ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమానులతో పాటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రిటెన్షన్ నియమంతో పాటు వేలం ఎక్కడ నిర్వహించాలి? ఫ్రాంచైజీల వద్ద ఎంత డబ్బు ఉండాలి? అనే విషయాలు కూడా చర్చకు రానున్నాయి. ‘మేము కొన్ని ప్రధాన అంశాలపై చర్చించాల్సి ఉంది. రిటెన్షన్ పర్స్, రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డ్స్, వేలం జరుగబోయే వేదిక.. ఇలా వీటన్నింటిపై ఓ అభిప్రాయానికి రావాలి.
ఈరోజుతో అన్ని విషయాలను తేల్చేస్తాం. ఆ వెంటనే మీడిమా వేదికగా ప్రకటన విడుదల చేస్తాం’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈసారి కనీసం ఐదు లేదా ఆరుగురిని అట్టిపెట్టుకునేందుకు అనుమతించనుందని సమాచారం. అదే జరిగితే.. జట్టు కూర్పుకోసం భారీగా ఖర్చు చేసిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంఐజీలకు అది తీపికబురే.
ఆనవాయితీ ప్రకారం ప్రతి మూడేండ్లకు ఓసారి ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. ఇప్పుడు ఆక్షన్ సమయం రానే వచ్చింది. అందుకని అన్ని ఫ్రాంచైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలేయాలి? అనే జాబితా తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. కానీ, బీసీసీఐ ఇంతవరకూ రిటెన్షన్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
దాంతో, ఈరోజు జరుగబోయే గవర్నింగ్స కౌన్సిల్ సమావేశంపైనే అందరి కళ్లు నిలిచాయి. ఇక వేలం వేదిక విషయానికొస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి భావిస్తున్నాయి.