ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొవ్వెక్కి ఇదేం దేశం అంటావా?.. భారతీయుడివి కాదని అనుకుంటే పాకిస్తాన్‌కో.. దుబాయికో పోవాలని సూచించారు. భారత పౌరుడవు అయ్యి ఉండి దేశాన్ని, హిందూ మతాన్ని కించపరచడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.
జగన్ ఐదేళ్లు రాష్ట్రాన్ని వల్లకాడులా మార్చేశాడని ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టేందుకు జగన్ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. డిక్లరేషన్‌పై సంతకం పెడితే భారతమ్మ ఇంట్లోకి రానివ్వదనా? లేదా క్రైస్తవ ఓట్లు పోతాయని పర్యటన రద్దు చేసుకున్నావా? అని నిలదీశారు. ఇప్పటికైనా దేశానికి, హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు రాష్ట్రంలో జగన్ పరిస్థితి, వైసీపీ పరిస్థితి ఏంటి అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ రోజుకీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వెళ్లలేకపోతున్నారని.. మిథున్ రెడ్డి రాజంపేట వెళ్లట్లేదని చెప్పారు. కొడాలి నాని, వంశీ, రోజాలు నియోజకవర్గాలకే కాదు కదా కనీసం వారి జిల్లాలకు కూడా వెళ్లలేకపోతున్నారని తెలిపారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలది అజ్ఞతవాసమైతే.. విజయిసాయిరెడ్డి వైజాగ్‌కు వెళ్లలేకపోతున్నారని అన్నారు. ఇక జగన్ తాను పుట్టిన రాయలసీమలోని తిరుపతికి వెళ్లలేకపోతున్నారని విమర్శించారు.