అమరావతి : తిరుమల దేవస్థానం, పవిత్రమైన లడ్డూలో కల్తీ (Laddu adulteration ) జరిగిందని వివాద అంశంపై ఏపీ ప్రభుత్వానికి ధైర్యముంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు(Chandra Babu) స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. నెయ్యికల్తీపై కల్తీ జరిగిందంటూనే ఎలా జరిగిందో తెలియందుంటున్నారని ఆరోపించారు.
లడ్డూ కల్తీపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలుసుకుని సీబీఐకు లేఖ రాయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సీబీఐ(CBI) , సుప్రీం(Supreme Court) , ఏపీ హైకోర్టుల(High Court) కు లేఖలు రాసి విచారణకు ఆదేశించాలని సూచించారు. విచారణ జరిపి నిజమని తేలితే శిక్షించాలని ఆయన కోరారు .
మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) తిరుమలకు వెళ్తానంటే అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. తిరుమలకు అనుమతి లేదని నోటీసులు ఇస్తారు. మళ్లీ ఎవరు వెళ్లొద్దని రెండునాల్కల ధోరణిని అవలంభిస్తు న్నారని మండిపడ్డారు. పరిపాలన చేయమని ఆ దేవుడు భారీ మెజార్టీతో కూటమికి అవకాశమిస్తే మీరు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. వందరోజుల కూటమి పాలనలో ధరలు ఇప్పటికే ఆకాశనంటాయని, వాటిని తగ్గించాలన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని ఆరోపించారు.