Father murder : సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం కనిపెంచిన కొడుకులే కన్నతండ్రిని దారుణంగా హత్యచేశారు. అతి కిరాతకంగా చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. ఆ తర్వాత విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రాస్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇంట్లో తవ్వి చూడగా అస్థిపంజరం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. 1994లో తన తండ్రి బుధమ్ సింగ్ కనిపించకుండా పోయాడని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు మృతుడి కుమారుడు పంజాబీ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరు సోదరులు మరో వ్యక్తితో కలిసి.. తన తండ్రితో గొడవపడ్డారని, ఆ తర్వాత నుంచి తన తండ్రి కనిపించకుండా పోయాడని పంజాబీ సింగ్ కలెక్టర్ కు తెలిపాడు. దాంతో వెంటనే కేసు దర్యాప్తు చేయాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించాడు.
కలెక్టర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇంట్లో తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీశారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం అస్తి పంజరాన్ని ల్యాబ్‌కు పంపించారు. కాగా బుధమ్ సింగ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో కన్న కొడుకులే ఆయనను హత్య చేశారు. అయితే 30 ఏళ్ల క్రితం తండ్రితో సోదరులు గొడవపడిన విషయం పంజాబీ సింగ్‌కు గుర్తుకొచ్చింది.
దాంతో పంజాబీసింగ్ అప్పుట్లో గొడవ దేనికి జరిగిందని, ఆ గొడవ తర్వాత తండ్రి ఏమయ్యాడని తన సోదరులను ప్రశ్నించాడు. దాంతో సోదరులు పంజాబీ సింగ్‌ను బెదిరించారు. దాంతో తన తండ్రి అదృశ్యానికి సోదరులే కారణమని పంజాబీ సింగ్ ఫిర్యాదు చేశాడు. అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డీఎన్ఏ టెస్టు కోసం పంపించారు. డీఎన్ఏ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.